
నమస్తే తెలంగాణ నెట్వర్క్:కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. శివ, కేశవ క్షేత్రాలు మహిళల నోములు, దీపారాధనతో కళకళలాడాయి. ఆలయాల ఆవరణలోని ఉసిరి చెట్టు కింద మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఇష్టదైవాన్ని మనసారా కొలిచారు.
శివకేశవులకు ప్రీతికరమైనది కార్తికమాసం. కార్తిక మాసానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. కార్తిక మాసంలో పౌర్ణమిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడు, విష్ణువు ఇద్దరికి ఇష్టమైన మాసం. శివకేశవులను తరిస్తే అంతా శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కార్తిక పౌర్ణమి సందడి నెలకొన్నది. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుంచే భక్తులు సమీపంలో ఉన్న శివాలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకొని శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరించి పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో శివాలయాలు మార్మోగాయి.
మనోహరాబాద్, నవంబర్ 19 : శివ్వంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బగళాముఖి అమ్మవారి శక్తి పీఠంలో జడ్పీటీసీ పబ్బా మహేశ్‌గుప్తా ఆధ్వర్యంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం విశేష పూజలు, సకలకార్యసిద్ధికై మహాయంత్ర హోమం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజాకార్యక్రమాల్లో రాష్ట్ర మహిళాకమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూజాకార్యక్రమాల్లో హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజారమణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ, అమ్మవారి ఉపాసకులు వెంకటేశ్వరశర్మ, వామశర్మ, సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, ఉప సర్పంచ్ పద్మా వెంకటేశ్, భక్తులు పాల్గొన్నారు.
కేతకీలో కార్తిక శోభ..
జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచిన కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం కార్తిక దీపోత్సవం, పార్వతీ సమేత సంగమేశ్వరుడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అమృతగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపాలను వెలిగించారు. పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్‌మూర్తి, ఆలయ చైర్మన్ నీలం వెంకటేశం గుప్తా, ఎంపీడీవో సుజాత, సర్పంచ్ జగదీశ్వర్, ఎంపీటీసీ రజినీప్రియ, టీఆర్ఎస్ అధ్యక్షుడు రాచయ్యస్వామి, భక్తులు పాల్గొన్నారు.
రాచన్నస్వామిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే
మండలంలోని బడంపేట రాచన్నస్వామి దేవాలయంలో శుక్రవారం కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యేకు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా రాచన్నస్వామి దేవాలయంలో భద్రకాళి దేవితో పాటు వీరభద్రావతారంలో కొలువుదీరిన రాచన్నస్వామికి అభిషేకం, ఆలయ గర్భగుడిలోని శివలింగానికి అన్నపూజలు, ఆలయ సమీపంలోని భ్రమరాంభమల్లికార్జునస్వామి దేవాలయంలో పూజలు చేశారు. జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డితో పాటు ఎంపీ బీబీ పాటిల్ దంపతులు నందీశ్వరుడి విగ్రహం వద్ద దీపాలను వెలిగించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, జడ్పీటీసీలు మీనాక్షీసాయికుమార్, మల్లికార్జున్‌పాటిల్, ఆలయ కమిటీ చైర్మన్ రాజుస్వామి, ఈవో శివరుద్రప్ప, సొసైటీ చైర్ పర్సన్ స్రవంతీఅరవింద్రెడ్డి, సర్పంచులు నర్సింహులు, రాజశేఖర్, ఎంపీటీసీ బక్కారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో కార్తీక పూజలు
కార్తిక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మల్లికార్జున స్వామి వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కొమురవెల్లికి కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి వారికి అభిషేకాలు, అర్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొందరు భక్తులు పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. చేర్యాల పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆకునూరులోని భవానీరుద్రేశ్వర స్వామి ఆలయంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉల్లేంగల ఏకానందం ఆధ్వర్యంలో శివ కల్యాణం నిర్వహించారు. అనంతరం సహస్ర దీపార్చన తదితర పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రేఖమల్లేశ్యాదవ్ పాల్గొన్నారు.