మెదక్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రేషన్ కార్డు దారులకు మళ్లీ ఉచిత బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల వరకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగింది. ఈ నెలలోనూ రూపాయికి కిలో బియ్యం చొప్పున అందజేశారు. అయితే ఈ ఉచిత బియ్యం పంపిణీని నవంబర్ వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 వరకు పంపిణీ పూర్తి కాగా, 20వ తేదీ నుంచి ఉచిత ప్రక్రియ మొదలై 30 వరకు పంపిణీ కొనసాగనున్నది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రెండేండ్లుగా ఉచిత బియ్యం పంపిణీ
కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పేద కుటుంబాలకు అండగా నిలువాలని ముందుగా ఒక్కొక్కరికీ 12 కిలోలు, ఆ తర్వాత పది కిలోల చొప్పున పంపిణీ చేశాయి. 2020 ఆగస్టు నుంచి గతేడాది నవంబర్ వరకు కేంద్రం 5 కిలోలు ఇస్తే, అంతే స్థాయిలో రాష్ట్రం మరో ఐదు కిలోలను ఒక్కో యూనిట్‌కు సరఫరా చేసింది. ఇదిలావుండగా డిసెంబర్ నుంచి మే వరకు ఒక్కో యూనిట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 5 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేశాయి. అయితే సెప్టెంబర్ వరకు ఉచిత బియ్యం ఇస్తామని కేంద్రం ప్రకటించగా మే, జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కిలో బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే తాజాగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నవంబర్ వరకు ఉచిత రేషన్ ఇస్తామని ప్రకటించడంతో ఈ నెల 16 వరకు రూపాయికి కిలో చొప్పున ఆరు కిలోలు పంపిణీ చేశారు. ఈ నెల 20 నుంచి యూనిట్‌కు 5 కిలోలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
పంపిణీ ఇలా..
రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి లబ్ధిదారుడిని ఆదుకునేందుకు ప్రభుత్వం బియ్యం కేటాయింపులు చేశాయి. ఆహార భద్రత లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ పది కిలోలు, అంత్యోదయ కార్డుకు 35కిలోలు ఇవ్వనున్నారు. అన్నపూర్ణ కార్డుదారులకు మాత్రం యథావిధిగా పది కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. కాగా మెదక్ జిల్లాలో 521 రేషన్ షాపులు ఉండగా, మొత్తం 2,02,587 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. అంత్యోదయ 13,906, అన్నపూర్ణ 75 కార్డులు ఉన్నాయి. అయితే జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 కిలోలు మొత్తం 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేయనున్నారు. దీంతో జిల్లాలో 7 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది.
పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..
నేటి నుంచి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మెదక్ జిల్లాలో 521 రేషన్ దుకాణాల్లో 2 లక్షల 2 వేల ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఆయా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 కిలోలు మొత్తం పది కిలోల బియ్యాన్ని సరఫరా చేస్తాం. ఈ అవకాశాన్ని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలి.
-శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, మెదక్