చేర్యాల, జూన్ 19 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని వీరశైవ ఆగమ పాఠశాలలో అడ్మిషన్ల కోసం ఆదివారం మల్లన్న ఆలయంలో నిర్వహించిన పరీక్ష సజావుగా జరిగింది. రెండేండ్లుగా కరోనా నేపథ్యంలో పాఠశాలలో అడ్మిషన్లు దేవాదాయశాఖ అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో పరీక్ష నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. 35 మంది దరఖాస్తులు చేసుకోగా, పరీక్షకు 26 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏఈవో వైరాగ్యం అంజయ్య, ఆలయ స్థానాచార్యులు పడిగన్నగారి మల్లేశం, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కేసీఆర్ ఉద్యమ ఫలితమే ఆగమ పాఠశాల
తెలంగాణ ఉద్యమం ఫలితంగా కొమురవెల్లిలో నాటి సీమాంధ్ర పాలకులు పాఠశాలను మం జూరు చేశారు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో 2009వ సంవత్సరంలో ఆగమ పాఠశాలను దేవాదాయశాఖ అధికారులు ప్రారంభించారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే యజ్ఞయాగాదులు, వివాహాది శుభకార్యాలు నిర్వహణకు అవసరమమ్యే పురోహితులు, వైదికులను తీర్చిదిద్దేందుకు పాఠశాలను ప్రారంభించారు. ఆగమ విద్య పఠించే విద్యార్థులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత బోధన, భోజ నం, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఆగమ పాఠశాలలో ప్రవేశానికి ఐదో తరగతి ఉత్తీర్ణత సాధించి 14 ఏండ్లలోపు వారై ఉండాలి. ఆగమ పాఠశాలలో ప్రవేశ (2 సంవత్సరాలు), వర (2 సంవత్సరాలు), ప్రవర (2 సంవత్సరాలు) కోర్సులతో పాటు జ్యోతిష్యంలో ముహూర్త భాగం వరకు విజ్ఞానం బోధిస్తారు.