పాపన్నపేట, జూన్18: ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం వద్ద మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తున్నది. ఎత్తు పల్లాలు, నైసర్గిక స్వరూపం, నీటి లోపల అంతర్గతంగా ఎక్కడ సొరంగాలు ఏర్పడ్డాయో, ఎక్కడ అడుగు భాగాన బండ రాళ్లు ఉన్నాయో స్థానికులకు తప్ప ఇతరులకు తెలియదు. ఇది తెలియక సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలో స్నానాలకు దిగి మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఏడుపాయల జాతర సమయంలోనూ చాలామంది నీటి ప్రమాదాలకు గురవుతుంటారు. గతేడాది ఏడుపాయలకు వచ్చిన భక్తుల్లో మంజీరా నదిలో మునిగి 14 మంది చనిపోయారు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కొంతమంది నీట మునిగి మృతి చెందగా మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా తమ వాహనంలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల జాతర సమయంలో నదిలో గజ ఈతగాళ్లను ఉంచడంతో ప్రమాదాల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది జూన్ 6 నాటికి ఐదుగురు మృతి చెందారు. ఈ ఏప్రిల్ 12న తూప్రాన్‌కు చెందిన బాబాయి, కుమారుడు జైహింద్, రాము హెచ్చరిక బోర్డును సైతం ఖాతరు చేయక నీటిలో దిగి మృతి చెందారు. ఈ నెల ఆరో తేదీన కామారెడ్డి జిల్లా దుర్కి గ్రామానికి చెందిన బాకా సాయిలు (42), వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చక్రంపల్లి గ్రామానికి చెందిన హకీమ్ (30) నీట మునిగి మృతిచెందారు ఏడుపాయలకు వచ్చే భక్తులు విందుల్లో మునిగి తేలుతుంటారు. ఎక్కువ మంది మద్యం మత్తులోనే నీటిలో పడి మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో నీట మునిగి మృతి చెందుతున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ఒకసారిపై విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రమాదకర స్థలమన్నా పట్టించుకోరా?
మంజీరా నది పొడుగునా ఎక్కడ ప్రమాద స్థలం పొంచి ఉందో గుర్తించిన పోలీసులు అక్కడ ‘ఇది ప్రమాదకరమైన స్థలం’ అంటూ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ భక్తులు ఇవి ఏమీ పట్టించుకోకుండా అదే చోట స్నానాలకు దిగి మృత్యు ఒడికి చేరుతున్నారు. పోలీసులు ఎంత కాపాలా ఉన్నా వారి మాటలను పెడచెవిన పెట్టి నీటిలోకి దిగేవారి సంఖ్య బాగానే ఉంటుంది. వారు హెచ్చరిక బోర్డులు పెట్టడమే కాకుండా అందులో దిగిన వారిని వద్దంటూ వారించినా బేఖాతరు చేస్తున్నారు. దీంతో వారిని నమ్ముకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జీవితంలో కోలుకోలేని స్థితిలో శోకసముద్రంలో మునిగిపోతున్నారు.
పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం
ఏడుపాయల్లో నీట మునిగి చాలామంది మృతి చెందుతున్నారు. నది నైసర్గిక స్వరూపం తెలియక నీటిలో దిగుతున్నారు. ప్రమాదకరమైన స్థలాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాం. విద్యావంతులు కూడా పట్టించుకోవడం లేదు. కొంతమంది పోలీస్ సిబ్బంది హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి నీటిలోకి దిగుతున్నారు. ఇక పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏడుపాయల ప్రధాన స్థలాల్లో పెట్టాం. ప్రజలను చైతన్యం చేయడానికి కరపత్రాలు పంచుతున్నాం. ఆయా పాఠశాలల్లో, గ్రామాల్లో విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాం. – విజయ్‌కుమార్, ఎస్సై, పాపన్నపేట
కేటాయించిన స్థలాల్లోనే స్నానాలు చేయాలి
లోతైన ప్రాంతాల్లో కంచె ఏర్పాటు చేస్తున్నాం. చాలామంది భక్తులకు ఏడుపాయల నదిపై అవగాహన లేక స్నాన వాటిలో ఏర్పాటు చేసిన మెట్లను దాటి నది లోపలికి వెళ్తున్నారు. నది లోపలి భాగంలో పెద్ద పెద్ద వరదల మూలంగా కయ్యలు ఏర్పడ్డాయి. అడుగు భాగాన పెద్ద పెద్ద బండరాళ్లు ఉండడంతో ఈత వచ్చినప్పటికీ నీట మునిగి చనిపోతున్నారు. భక్తులు మెట్లపైనే స్నానాలు చేయాలి. ప్రమాద సూచికలు ఉన్న చోట నీటిలోకి దిగకుండా జాగ్రత్తలు వహించాలి.
– సాతెల్లి బాలాగౌడ్, ఏడుపాయల పాలక మండలి చైర్మన్