మెదక్, (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి కలెక్టరేట్, జూ న్ 18: జిల్లాలో ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా శనివారం ముగిశాయి. ఈ నెల 3 నుంచి 18 వరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కార్యాలయాలు, పార్కుల్లో పచ్చదనం, పరిశుభ్రత, రోడ్లు, కాల్వలు, విద్యుత్ దీపాల మరమ్మతులు తదితర పనులు చేపట్టారు. ఐదో విడత పల్లె ప్రగతిలో భాగంగా మొదటి రోజు గ్రామ సభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళికను తయారు చేశారు. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, నాలుగు విడతల్లో సాధించిన ఫలితాలను నివేదిక రూపంలో గ్రామ సభ ఎదుట చదివి వినిపించారు. గ్రామస్తుల సహకారంతో శ్రమదానంతో కలుపు మొక్కలు తొలగించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. రెండు రోజుల పాటు గ్రామంలోని అన్ని వీధులను శుభ్రం చేశారు. ఒక రోజు పవర్‌డే పాటించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు తదితర సమస్యలను పరిశీలించి సమస్యలు ఉంటే వాటిని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు.
మెదక్ జిల్లాలో 469 పంచాయతీల్లో..
పక్షం రోజుల నుంచి నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ఈ నెల 3న ప్రారంభమైన ఐదో విడత పల్లె ప్రగతిలో జిల్లాలోని 469 పంచాయతీల్లో మొదటి రోజు గ్రామసభలు నిర్వహించి, సమస్యలు తెలుసుకు ని కార్యాచరణతో ముందుకెళ్లినట్లు తెలిపారు. ప్రజ లు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టితో క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. హవేళీఘనపూర్ మండలం సుల్తాన్పూర్, చిన్నశంకరంపేట మండలం మడూరు వంటి గ్రామాల్లో పల్లె ప్రగతితో గుణాత్మకమైన మార్పులు కనిపిస్తున్నాయన్నారు.
నిరంతరంగా గ్రామాల్లో పారిశుధ్య కార్యకమాలు నిర్వహిస్తున్నామని, ఎవరైనా చెత్త రోడ్డుపై వేస్తే జరిమానాలు విధిస్తామని ప్రజల్లో అవగాహన కలిగించామని తెలిపారు. జిల్లాలో ప్రత్యేకంగా సెగ్రిగేషన్ షెడ్ ఉత్సవాలు నిర్వహించి, పారిశుధ్య కార్మికులను సన్మానించుకున్నామన్నారు. వానకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లు, మురుగు కాల్వలు, పబ్లిక్ ఇనిస్టిట్యూషన్ తదితర ప్రాంతాలు శుభ్రపరిచామన్నారు. గ్రామ సభలోగుర్తించిన విద్యుత్ సమస్యలను పవర్డేగా గుర్తించిన 7, 8 తేదీల్లో పనులు చేపట్టామన్నారు. 15వ తేదీన క్రాస్ కంట్రీ పేరిట బృహత్ పల్లె ప్రకృతి వనాలు, బ్లాక్ ప్లాంటేషన్ తదితర ప్రాంతాల్లో మొక్కల తాజా పరిస్థితిని పరిశీలించి, చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటినట్లు తెలిపారు. పక్షం రోజుల్లో పల్లెప్రగతిలో 1,540 కిలోమీటర్ల మేర రోడ్లు, 966 కిలోమీటర్ల మేర మురుగు కాల్వలు, 1,885 పబ్లిక్ ఇనిస్టిట్యూషన్స్‌లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రతిమాసింగ్ పేర్కొన్నారు.
552 భవన శిథిలాలు తొలగించామని, 2,393 ప్రాంతాల్లో ముళ్ల పొదలు, తుమ్మచెట్లు, పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు 983 ప్రాంతాల్లో గుంతలు పూడ్చి, 793 లోతట్టు ప్రాంతాలు చదును చేశామన్నారు. 310 కమ్యూనిటీ సోక్ ఫిట్ల ఏర్పాటుకు 46 నిర్మించామని, నిరుపయోగంగా ఉన్న 53 బోరుబావులను పూడ్చివేశామని ఆమె తెలిపారు.ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి, తూప్రాన్ మండలం మనోహరాబాద్‌లో జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతశేఖర్‌గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ముగిసిన పల్లె ప్రగతి
సంగారెడ్డి జిల్లాలోని 647 గ్రామాల్లో ఈ నెల 3న గ్రామ సభలు నిర్వహించడంతో మొదలైన పల్లె ప్రగతితో పల్లెల రూపు రేఖలు మారాయి. ఇంటింటికీ మొ క్కల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 4,50,992 మొక్కలు పంపిణీ చేసి, నిర్దేశిత లక్ష్యంలో 96 శాతం సాధించారు. మొక్కలను బాగా పెంచిన వారిని గుర్తించి 22 మందిని సన్మానించారు. 15 రోజుల్లో జిల్లాలోని 1,973 కిలో మీటర్ల రోడ్లను శుభ్రం చేశారు. 1,333 కిలో మీటర్ల డ్రైనేజీలతో పాటు 2,669 ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేశారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలో శిథిలావస్థలో ఉన్న 982 పాత ఇండ్లు, గోడలు, చెత్త దిబ్బలు తొలగించారు. 2,738 స్థలాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను గుర్తించి తొలగించి శుభ్రం చేశారు. 1,169 గుంతలు పూడ్చారు. 892 ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉంటుందని, మట్టితో నింపి పూడ్చారు. 608 ఇంకుడు గుంతలు, 200 సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తిచేశారు. 33 పాడుబడిన బోరుబావులను, నిరుపయోగంగా 53 బావులు మూసివేశారు. వైకుంఠధామాలకు విద్యుత్, నీటి సౌకర్యం కల్పించారు.