పటాన్చెరు, జూన్ 14 : సర్కారు బడి అనగానే పాతభవనాలు, కిటికీలు, తలుపులు విరిగి కళాహీనంగా ఉంటుందనే ఆలోచన సర్వత్రా ఉంటుంది. కానీ, ఇప్పుడు తెలంగాణలో సర్కారుబడి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం ఖర్చుకు రాజీపడకుండా నూతన భవనాలను నిర్మించి చిన్నారుల బంగారు భవితకు బాటలు వేస్తున్నారు. కాగా, పటాన్చెరు మండలంలో గురువారం మూడు ప్రాథమిక పాఠశాలల నూతన భవనాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు. పాత భవనాలను కూల్చివేసి అన్ని హంగులతో, విశామైన తరగతి గదులతో నూతనంగా పాఠశాలలను నిర్మించారు. ఇప్పుడు కొత్త పాఠశాలలను చూసిన తల్లిదండ్రులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల దీటుగా ప్రభుత్వ బడులు ఉన్నాయని మురిసిపోతున్నారు.
ప్రారంభం కానున్న నూతన భవనాలు
పటాన్చెరు మండలం పాటి గ్రామంలో నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దీనితో పాటు ఇస్నాపూర్, లక్డారం గ్రామంలోనూ నిర్మాణాలు పూర్తి చేసుకున్న పాఠశాలల భవనాలను ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. పాటిలో ఒకప్పుడు శిథిలావస్థలో కనిపించిన పాఠశాల భవనాన్ని చూసిన సర్పంచ్ మున్నూరు లక్ష్మయ్య వాటి స్థానంలో కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని సంప్రదించారు. ఎమ్మెల్యే తక్షణమే ఆమోదించడంతో రూ. 1.10 కోట్ల ఖర్చుతో రెండస్థుల్లో కార్పొరేట్ స్థాయిలో భవనం నిర్మించారు. ఎమ్మెల్యే సహకారంతో డీఎంఎఫ్టీ నిధులు రూ. 50 లక్షలు, గ్రామ పరిధిలోని హాల్‌మార్క్, ఎంపీఆర్, ఎస్ఎస్ స్కార్ ఈ సంస్థలు రూ. 60 లక్షల వరకు సాయం అందజేశాయి. దీంతో అద్భుతమైన పాఠశాల భవనం పాటి గ్రామ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. విశాలమైన తరగతి గదులు, మూత్రశాలలు, ప్లేగ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. సర్పంచ్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో పాఠశాలకు కొత్త సొబగులు సమకూరాయి. లక్డారంలోనూ ప్రాథమిక పాఠశాలకు రూ. 50లక్షలతో డీఎంఎఫ్టీ నిధులు ఖర్చు చేసి నిర్మాణం పూర్తి చేశారు. ఇస్నాపూర్‌లో ప్రాథమిక పాఠశాలను రూ. 40లక్షలు ఖర్చు చేసి నిర్మించారు. విశాలమైన తరగతి గదులు ఏర్పాటు చేశారు.
ఇంగ్లిష్ మీడియానికి ఆదరణ
పటాన్చెరు మండల వ్యాప్తంగా ఇప్పుడు ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తున్నది. కరోనా మహమ్మారి సమయంలో పాఠాలు చెప్పకుండానే ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు యజమాన్యాలను ఇప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ సర్కారు బలోపేతం చేయడం అందరినీ ఆలోచింపజేస్తున్నది. పాత భవనాల స్థానంలో అన్ని హంగులతో కొత్త భవనాలు అందుబాటులోకి రావడంతో పాటు, ఇంగ్లీష్ మీడియం చదువులు అందరికీ అందుతుండడం తల్లిదండ్రులకు వరంలా మారింది. ఉచిత విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫాం, ఉచితంగా పుస్తకాలు అందజేస్తుండడం వారిని ఆకర్షిస్తున్నది.
ఎమ్మెల్యే సహకారంతో నూతన భవనాలు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సహకారంతో కొత్త పాఠశాల భవనాలను నిర్మించాం. పాటి, ఇస్నాపూర్, లక్డారం లో పాత భవనాలుండేవి. వాటి స్థానంలో సర్పంచ్ల కోరిక మేరకు కొత్త భవనాలను నిర్మించి విద్యార్థులకు సౌకర్యవంతంగా మార్చాం. సహకరించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు.
-సుష్మశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీపీ పటాన్చెరు
ప్రైవేటుకు దీటుగా..
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించాం. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రోత్సహించడంతో పాటు నిధులు మంజూరు చేయించారు. ఎమ్మెల్యే, దాతలు చేసిన సాయాన్ని మా గ్రామస్తులు ఎన్నటికీ మరువలేం.
-మున్నూరు లక్ష్మయ్య, సర్పంచ్ పాటి గ్రామం
