రామాయంపేట, మే 31: మనిషి బతికున్నంత కాలం క్షణం తీరిక లేకుండా బ్రతుకుతాడు. కానీ, విగత జీవిగా మారిన తర్వాత ఎక్కడో చెట్ల వద్ద, పుట్టల వద్ద ఖననం చేయడం అనాది నుంచి వస్తున్నది. దీంతో చివరి మజిలీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురికావాల్సి పరిస్థితి ఏర్పడింది. ఖననం అయిన తర్వాత కుటుంబీకులు రోడ్డుపైనో, చెరువుల్లోనో, బోర్ల వద్దనో ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ స్నానాలు చేసేవారు. దీనిని గమణించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలను నిర్మించాలనే ఉద్దేశంతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
సకల హంగులతో వైకుంఠధామాలు
ఈజీఎస్ నిధుల ద్వారా రామాయంపేట మండలంలోని దామరచెర్వు, కాట్రియాల, అక్కన్నపేట, పర్వతాపూర్ గ్రామాల్లో ఒక్కోటి రూ. 10లక్షలతోనే పూర్తి చేశారు. ప్రస్తుతం మిగతా 11గ్రామ పంచాయతీల్లో రూ. 12.50 లక్షలతో పనులు పూర్తి అయ్యాయి. వైకుంఠధామంలో ఖననం కోసం ఒక ప్రత్యేకత ఉంటుంది. ఖననం చేయడానికి ప్లాట్‌ఫాంతో పాటు స్నానాల గదులు, మరుగుదొడ్లు, బోరుబావులను తవ్వించి షవర్లను సైతం ఏర్పాటు చేశారు. స్నానాల అనంతరం మహిళలు బట్టలు మార్చు కోవడం కోసం కూడా ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. శ్మశానాలకు ప్రహరీల ఏర్పాటు కూడా పూర్తయ్యాయి. వైకుంఠధామాల్లోని ప్రహరీల చుట్టూరా హరితహారం మొక్కలను నాటి వాటి బాధ్యతను సర్పంచ్, కార్యదర్శులే చూస్తున్నారు.
ఈ నిర్మాణాలపై సీఎం ప్రత్యేక దృష్టి
వైకుంఠధామాల నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రతి పల్లెలోను వైకుంఠధామం కచ్చితంగా ఉండాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీచేసి 2014 నుంచి 2022వరకు వందకు వంద శాతం వైకుంఠధామాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. సీఎం ఆదేశానుసారం అధికారులు సైతం ఊరూరా వైకుంఠధామాలను నిర్మించి శభాష్ అనిపించుకున్నారు. మండల కేంద్రాల్లోనే ఈ బాధ్యతను సంబంధిత ఎంపీడీవోలకు, ఏపీవోలకు అప్పగించి త్వరితగతిన పూర్తి చేసేలా పురమాయించారు. నిర్మించిన వాటికల్లో రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో సర్పంచ్ నర్సాగౌడ్ ప్రారంభిం చి దహన సంస్కారాలను కూడా చేయించారు. గ్రామాల్లో నిర్మించిన ఈ వైకుంఠధామాలు కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతున్నాయి.
శ్మశాన వాటికలన్నీ పూర్తి చేశాం
రామాయంపేట మండల వ్యాప్తంగా 15 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేసింది. ప్రస్తుతం 11గ్రామ పంచాయతీల్లో ఒక్కో వైకుంఠ ధామాన్ని రూ. 12.50 లక్షల తో నిర్మించాం. కొన్ని శ్మశాన వాటికల్లో దహన సంస్కారాలను కూడా ఆయా గ్రామాల సర్పంచ్‌లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సార్ అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశాం. మొత్తం రామాయంపేట మండలంలో రూ. 1కోటి 77లక్షల 50 వేల నిధులతో మొత్తం వైకుంఠధామాలు పూర్తి చేశాం.
– యాదగిరిరెడ్డి, ఎంపీడీవో