పాపన్నపేట, మే 25 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషిచేస్తున్నదని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి అన్నారు. పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో చివరి రోజు కొనసాగిన శ్రీ సీతారామాంజనేయ, సత్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్సీ దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం స్వామి మాధవానందస్వామి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. మల్లంపేటలో ఎక్కడాలేని విధంగా సీతారామాంజనేయ ఆలయాన్ని నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో ప్రశాంత్‌రెడ్డి పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు. రాబోయే శ్రీరామనవమికి నూతన ఆలయం పక్కనే వ్రతాలు చేయడానికి సత్ర నిర్మాణానికి సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని ఆయన వెల్లడించారు. పాపన్నపేట నుంచి చీకోడ్, లింగంపల్లి వరకు సింగల్ రోడ్డు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని డబుల్ రోడ్డుగా ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. మల్లంపేటలో వివిధ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ తెలిపారు. బుధవారం వైభవంగా ధ్వజస్తంభం, విగ్రహ యంత్ర ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. తొగుట పీఠాధిపతి మాధవానందస్వామి మాట్లాడుతూ మల్లంపేటలో సుందరమైన ఆలయం నిర్మించడం సంతోషంగా ఉంద ని, నూతన ఆలయంలో నిత్యం పూజలు చేస్తూ, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందన ప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్ బాపురెడ్డి, పాపన్నపేట ఎంపీటీసీ సభ్యులు ఆకుల శ్రీనివాస్, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, భక్తులు పాల్గొన్నారు.