సంగారెడ్డి కలెక్టరేట్, మే 25: గ్రామీణ క్రీడా ప్రాంగణాలను జూన్ ఒకటిలోగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కంది మండలంలోని ఇంద్రకరణ్, సంగారెడ్డి మండలంలోని కులబ్గూర్ గ్రామాలను ఆయన సందర్శించారు. ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జూన్ 2న క్రీడా ప్రాంగణాలను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలను అభివృద్ధి చేసేందుకు నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యత ఉన్నదని, ఎలాంటి అలసత్వం లేకుండా పనులు జరగాలని ఆయన హెచ్చరించారు.
ప్రహరీ నిర్మించాలన్న హెచ్ఎంకు మెమో జారీ
అవసరం లేకపోయినా పాఠశాలలో ప్రహరీ నిర్మించాలని కోరిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మెమో జారీ చేయాలని అదనపు కలెక్టర్ డీఈవోకు సూచించారు. ‘మన ఊరు-మన బడి’ కా ర్యక్రమంలో భాగంగా కాశీపూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అంగన్వాడీ, పాఠశాల ఒకే కం పౌండ్లో ఉన్నప్పటికీ మధ్యలో ప్రహరీ నిర్మించేందుకు బేస్మెంట్ పనులు చేస్తుండటాన్ని గమనించి, హెచ్ఏం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ వెంట కంది మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవీందర్, మండల పంచాయతీ అధికారి మహేందర్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు.