సిద్దిపేట అర్బన్, మే 20 : విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, జిల్లా విద్యాధికారి రవికాంతారావుతో కలిసి సిద్దిపేట నియోజకవర్గంలో మొదటి విడతలో ఎంపికైన 76 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో రూ.30 లక్షల లోపు అంచనా గల పాఠశాలలు 51, రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు అంచనా గల పాఠశాలలు 25లుగా గుర్తించామన్నారు. మొదట 51 పాఠశాలల్లో మేజర్, మైనర్ మరమ్మతులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు,
నీటి వసతి తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మిగతా 25 పాఠశాలల్లో సాధారణ మౌలిక వసతులతో పాటు అదనపు తరగతుల నిర్మాణం, నూతన భవన నిర్మాణాలు చేపడుతామన్నారు. నియోజకవర్గంలోని 76 పాఠశాలల అభివృద్ధికి గాను రూ.20.89 కోట్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు మంజూరు చేయించినట్లు తెలిపారు. మొదటి విడత పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఉందని.. వచ్చే ఏడాది ఇంగ్లిష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గంలోని ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు. సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాసరావు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, మండల విద్యాధికారులు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.