మద్దూరు (ధూళిమిట్ట), మే 3 : నానాటికి అడువుల విస్తీర్ణం తగ్గుతుండడంతో జీవరాసుల మనుగడ ప్రశ్నార్థ్ధకమవుతున్నది. అడవుల్లో ఉండాల్సిన కోతులు, నెమళ్లు తదితర వన్యప్రాణులు జనం మధ్యలోకి వస్తున్నాయి. దీనికితోడు వృక్షసంపద తగ్గడంతో ప్రాణవాయువు కూడా అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ఇప్పటికే కోట్లాది మొక్కలను నాటింది. ఇప్పుడు ఎటుచూసినా పచ్చని చెట్లతో పల్లెటూర్లు కళకళలాడుతున్నాయి. దీనికితోడు గ్రామాల్లో జనం మధ్యలోనే వనాలను సృష్టించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ ప్రకృతి వనాలను సృష్టించి 20 రకాల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వినియోగించడం, ప్రభుత్వ భూములు లేని గ్రామాల్లో ప్రైవేటు భూములను కొనుగోలు చేసి ఈ వనాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
రూపుదిద్దుకుంటున్న వనాలు..
గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రకృతి వనంలో మొక్కలతో పాటు పిల్లలు ఆడుకునే విధంగా ఆట స్థలం, వాకింగ్ చేసుకునేందుకు వాకర్స్ లేన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో బృహత్ పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి సుమారు రూ.45 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఒక్కో వనంలో సుమారు 30వేల మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఒక్కో మొక్కకు ప్రభుత్వం రూ. 20 ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు వడివడిగా సాగుతున్నాయి.
ఎనిమిది గ్రామాల్లో బృహత్ ప్రకృతి వనాలకు..
మద్దూరు, ధూళిమిట్ట మండలా పరిధిలో బృహత్ ప్రకృతి వనాల నిర్మాణాల కోసం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను గుర్తించి, వనాల నిర్మాణాల కోసం ఆ భూమిని కేటాయించారు. మద్దూరు మండల కేంద్రంతో పాటు నర్సాయపల్లి, లద్నూర్ గ్రామాల్లో 10 ఎకరాల చొప్పున భూమిని కేటాయించారు. ధూళిమిట్ట మండల కేంద్రంలో- 09 ఎకరాలు, ధర్మారంలో-05, మర్మాములలో -07, వంగపల్లిలో-02, బెక్కల్‌లో-03 ఎకరాల ప్రభుత్వ భూమిని బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం కేటాయించారు. బృహత్ పల్లె ప్రకృతి నిర్మాణల్లో జిల్లాలో మద్దూరు మండలం మూడో స్థానంలో నిలిచిందని అధికారులు తెలుపుతున్నారు.
అన్ని గ్రామాల్లో వనాల నిర్మాణాలకు కృషి
మద్దూరు, ధూళిమిట్ట మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్మాణలకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే ఏడు గ్రామాల్లో వనాల నిర్మాణాలకు ప్రభుత్వ భూములను కేటాయించి వాటిల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నాం. త్వరలోనే అన్ని గ్రామాల్లో ఈ వనాల నిర్మాణాలను పూర్తిచేసి జిల్లాలోనే ప్రథమ స్థాయిలో నిలిచేందుకు ప్రణాళికలను రూపొందించాం.
-బద్దిపడిగె కృష్ణారెడ్డి, ఎంపీపీ, మద్దూరు
బృహత్ ప్రకృతి వనాల్లో మొక్కలు నాటుతున్నాం..
ఏడు గ్రామాల్లో బృహత్ ప్రకృతి వనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. మూడు గ్రామాల్లో ఇప్పటికే 20 వేల మొక్కలు నాటాం. ఈ బృహత్‌పల్లె ప్రకృతి వనాల్లో పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలతో పాటు పూల మొక్కలు నాటుతున్నాం. ఇందు కోసం గ్రామాల్లోని హరిత నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నాం. అందుబాటులో లేని మొక్కలను అటవీ శాఖ నర్సీరీల్లో నుంచి తెప్పించాం.
-పరశురాములు, ఈసీ, ఈజీఎస్
20 రకాల మొక్కల ఏర్పాటు
బృహత్ పల్లె ప్రకృతి వనంలో ప్రధానంగా 20 రకాల మొక్కలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. గతంలో గ్రామాల్లో అన్ని రకాల చెట్లుండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ వనాల నిర్మాణాలతో పలు రకాల చెట్లు ఊర్లో ఒకచోట పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, వేప, గంధపు మొక్క, రేగు, కుంకుడు, పనస, నెమిలినార, తంగేడు, సీతాఫల్, దానిమ్మ, నిమ్మ, వెదురు, పారిజాతం, తిప్పతీగ వంటి మొక్కలను నాటాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మొక్కలన్నింటినీ గ్రామంలోని హరిత నర్సరీల్లోనే పెంచాలని కొరత ఉంటే పొరుగు గ్రామం నుంచి తీసుకురావాలని యోచిస్తున్నారు. పచ్చదనం ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన, గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదం కోసం ఈ బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఎంతగానో దోహదపడుతాయని అధికారులు చెబుతున్నారు.