ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏడు విడతులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 8వ విడత ఈ వానకాలంలో ప్రభుత్వం చేపట్టనుంది. 8వ విడత హరితహారంలో భాగంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. నోడల్ ఏజెన్సీగా ఈజీఎస్ శాఖ వ్యవహరిస్తున్నది. వర్షాలు ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ మొక్క నాటి 8వ విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆ తర్వాత అధికారికంగా కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈసారి 77 రకాల మొక్కలను నాటేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఇందులో పండ్లు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలు ఉన్నాయి.
మెదక్/సంగారెడ్డి, మే 2 : హరితహారంతో తెలంగాణను ఆకుపచ్చని తోరణంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందులో భాగంగా గత ఏడు విడతల్లో హరితహారం కార్యక్రమం విజయవంతంగా అమలైంది. ఈసారి వానకాలంలో 8వ విడత చేపట్టనున్నారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కను బతికించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఒక మొక్క సంరక్షణకు నెలకు రూ. 3 చొప్పున ఖర్చుచేస్తున్నది. మొక్కల రక్షణకు బాధ్యత తీసుకున్న కూలీల ఖాతాల్లో ఎన్ని మొక్కలను సంరక్షణ చేస్తున్నారు అనే వివరాలను క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించి జమ చేస్తున్నారు. గుంతలు తీయడం నుంచి మొక్కల సంరక్షణ వరకు ప్రభుత్వం నిధులు ఖర్చుచేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నది. ఒక మొక్క నాటేందుకు గుంతకు రూ.17, నాటేందుకు రూ.4, నర్సరీలలో మొక్క పెంచేందుకు రూ.9 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది. మొక్కలు నాటడమే కాకుండా రక్షణ చర్యలకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఈసారి రోడ్లకు ఇరువైపులా, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, చర్చిలు, రైతు వేదికలు, పొలం, చెరువు గట్లు, నివాసాల ముందు, విద్యాసంస్థలు, చెరువులు, శిఖం భూములు, బృహత్తర ప్రకృతి వనా లు, ఇతర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో 8వ విడత హరితహారానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ ఏడాది 34.42 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లావ్యాప్తంగా 469 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. అటవీశాఖ, డీఆర్డీఏ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలను పెంచుతూ 8వ విడతకు సిద్ధం చేస్తున్నారు. మండలానికో అధికారికి హరితహారం బాధ్యతలు అప్పగించారు. నాటిన ప్రతి మొక్కనూ కాపాడేందుకు జియోట్యాగింగ్ చేయనున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. పండ్లు, నీడనిచ్చే మొక్కలనే ఎక్కువగా నర్సరీల్లో పెంచుతున్నారు. బాదం, వేప, కానుగ, చింత, మామిడి, నిమ్మ, దానిమ్మ, గులాబీ, మందార, జామ, ఉసిరి, మల్లె తదితర మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. టేకు, వేప, చింత, ఈత, ఇప్ప, వెదురు, మోదుగ, మారేడుతో పాటు ఇతర పండ్లు, ఔషధ మొక్కలను విరివిగా నాటించడానికి ప్రణాళిక రూపొందించారు. నర్సరీల్లో ప్లాస్టిక్ సంచుల్లో ఎరువులు నింపడం, విత్తడం, బెడ్లను సిద్ధం చేయడం, నీరు అందుబాటులో ఉంచడం లాంటి పనులు పూర్తయ్యాయి.
జిల్లాలో శాఖల వారీగా లక్ష్యాలు..
డీఆర్డీవో 23,00,000, వ్యవసాయ 20,000, బీసీ వెల్ఫేర్ 5,000, విద్యాశాఖ 20,000, ఫారెస్ట్ శాఖ 4,00,000, ఉద్యానవన శాఖ 50,000, ఇండస్ట్రీస్ 30,000, ఇరిగేషన్ శాఖ 25,000, మార్కెటింగ్ శాఖ 5,000, మెడికల్ అండ్ హెల్త్ 2,000, మైన్స్ అండ్ జియోలజీ 30,000, మైనార్టీ వెల్ఫేర్ 5,000, మిషన్ భగీరథ 10,000, పోలీసు శాఖ 10,000, ఎక్సైజ్ శాఖ 30,000, ఎస్సీ వెల్ఫేర్ 5,000, ట్రైబల్ వెల్ఫేర్, 5,000 టీఎస్ఎస్ పీడీసీఎల్ 5,000, వెటర్నరీ 30,000, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 5,000, మొత్తం 34,42,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
బల్దియాల్లో లక్ష్యాలు..
మెదక్ మున్సిపాలిటీ 1,50,000, నర్సాపూర్ మున్సిపాలిటీ 1,00,000, రామాయంపేట మున్సిపాలిటీ 1,00, 000, తూప్రాన్ మున్సిపాలిటీ 1,00,000 చొప్పున మొక్కలు నాటే లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో 8వ విడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు అధికారులు నర్సరీల్లో 1,07,26,500 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉంచారు. ఈసారి 50,24,542 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు. జిల్లాలో 639 ఈజీఎస్ పాండ్స్ల్లో మొక్కలు పెంచగా, అమీన్పూర్ మండలంలోని 8 గ్రామ పంచాయతీ నర్సరీల్లో 77 రకాలు మొక్కలు పెంచి హరితహారంలో నాటనున్నారు. ప్రభుత్వం శాఖల వారీగా నాటనున్న మొక్కల లక్ష్యాన్ని నిర్దేశించింది. వ్యవసాయ శాఖ 1,000, డీఆర్డీవో 28,00,000, దేవాదాయశాఖ 1,000, ఆబ్కారీ 1,00,000, అటవీశాఖ 5,00,000 ఉద్యానశాఖ 1,00,000, ఇండస్ట్రీస్-టీఎస్ఐఐసీ 1,00,000, హోంశాఖ 25,000, విద్యాశాఖ 5,000, జాతీయ రహదారులు 3,10,000, సంక్షేశాఖలు 1,000, పశుసంవర్ధక, మత్య్సశాఖలు 1,000, జైళ్ల శాఖ 1,000, స్త్రీ శిశు సంక్షేమశాఖ 1,500, మొత్తం 39,46,500 మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో నిర్దేశించింది.
మున్సిపాలిటీలకు లక్ష్యాలు..
అందోల్-జోగిపేట బల్దియాలో 70,554, అమీన్పూర్ 1,76,966, బొల్లారం 1,04,187, నారాయణఖేడ్ 49,450, సదాశివపేట 1,02,886, సంగారెడ్డి 2,47,845, తెల్లాపూర్ 1,31,000, జహీరాబాద్ 1,95,154, మొత్తం 10,78,042 మొక్కలు బల్దియాలకు టార్గెట్ ప్రభుత్వం ఇచ్చింది.
ఆదేశాలు రాగానే నాటుతాం..
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే 8వ విడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతాం. జిల్లాలో 647 గ్రామ పంచాయతీల నర్సరీల్లో 77 రకాల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 50.24 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, అందుబాటులో 1.07 కోట్ల మొక్కలు రెడీగా ఉన్నాయి. మొక్కలు నాటేందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలి. జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
– శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో సంగారెడ్డి
అందరినీ భాగస్వామ్యం చేస్తాం
ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం అమలుకు సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో 469 నర్సరీల్లో 34.42లక్షల మొక్కలు రెడీగా ఉన్నాయి. డీఆర్డీవో ఆధ్వర్యంలోనే 23 లక్షల మొక్కలు నాటనున్నాం. జూన్‌లో మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అందరినీ ఈ కార్యక్రమంలో భా గస్వామ్యులను చేస్తాం. లక్ష్యాలను పూర్తిచేస్తాం. ఆకుపచ్చ మెదక్ జిల్లానే లక్ష్యంగా శ్రమిస్తున్నాం.
-శ్రీనివాస్, డీఆర్డీవో మెదక్