మెదక్ మున్సిపాలిటీ, మే 1: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న ముస్లింలు, దాన ధర్మాల పండుగలా భావించే ‘ఈద్-ఉల్-ఫితర్’ను నేడు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. సామరస్య భావాలకు, సమున్నత జీవన విధానానికి ప్రతీకగా, పరస్పర ప్రేమ, శాంతి, సహనాన్ని ప్రబోధించిన రోజుగా భావించే ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఈద్గాలను ముస్తాబు చేశారు. నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు విరమించి ఈద్-ఉల్-ఫితర్‌ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ‘ఈద్-ఉల్-ఫితర్’ను దానధర్మాల పండుగగా భావిస్తారు. నిరుపేదలకు విస్మరించకూడదనే తాఖీదును అనుసరించి ప్రతి ముస్లిం తనకు తోచిన మేరకు ఫిత్రా(దానం) ఇస్తారు. పేద, ధనిక వ్యత్యాసం లేకుండా కుటుంబ సభ్యులందరి తరఫున ఫిత్రా చెల్లించాలనే వారి ఫర్జ్(నియమం). రంజాన్ చివరి ఉపవాసం రోజు నెలవంక చూశాక ఈద్ నమాజ్‌కు వెళ్లే ముందు ఫిత్రా చెల్లిస్తారు. నిరుపేదలు సైతం పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలనేది సారాంశం అందులో ఉంది. పండుగ రోజున ముస్లింలు ఉదయమే స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈద్గాల్లో ప్రార్థనల అనంతరం మత పెద్దల సందేశాలను శ్రద్ధగా వింటారు. ఆలింగనాలు చేసుకుని పరస్పర శుభకాంక్షాలు (ఈద్‌ముబారక్) తెలుపుకుంటారు.
ఈద్గా వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్
నెలవంక కనిపించడంతో మంగళవారం రంజాన్ పండుగను చేసుకోవాలని మత పెద్దలు పేర్కొనడంతో పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి జిల్లా కేంద్రం మెదక్‌లోని ఈద్గా, మసీదులను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. నవాపేట వీధిలోని ఈద్గా వద్ద వేలాది మంది ప్రార్థనలు చేయనుండడంతో సోమవారం మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఈద్గా పరిసరాలను శుభ్రం చేయించారు. ఆయా పనులను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కమిషనర్ శ్రీహరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చంద్రపాల్ మాట్లాడుతూ ఈద్గా వద్ద పలు ఏర్పాట్ల కోసం రూ.లక్ష 25 వేలు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభకాంక్షలు తెలిపారు.
పండుగను సంతోషంగా జరుపుకోవాలి:ఎమ్మెల్యే క్రాంతికిరణ్
ప్రతి ముస్లిం సంతోషంగా జరుపుకోవాలని, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్. మతసామరస్యం ఉట్టిపడేలా పండుగ నిర్వహించుకోవాలన్నారు.
ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు : ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని, ఈ పవిత్ర మాసం మీరు చేసిన ఉపవాస దీక్షలు ఫలించి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచాలని ఆకాంక్షించారు. కరోనాతో రెండు రంజాన్ పండుగలను సామూహికంగా, సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోలేకపోయామన్నారు. ఈ సంవత్సరం రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అల్లా దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు :ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
రంజాన్ సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. ముస్లింల దీక్షా ఫలితంగా ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని
ఆకాక్షించారు.
ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు:మెదక్ కలెక్టర్ హరీశ్
ముస్లింలందరికీ మెదక్ కలెక్టర్ హరీశ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యానికి, ఐకమత్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని పేర్కొన్నారు. ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
రంజాన్ శుభాకాంక్షలు: సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా జిల్లాలోని ముస్లింలందరికీ కలెక్టర్ హనుమంతరావు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం కలెక్టర్ ఒక ప్రకటన జారీ చేస్తూ మత సామరస్యానికి, ఐకమత్యానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు.
ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు: మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
ముస్లిం ప్రజలందరికీ రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్ ) సందర్భంగా మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.