పటాన్చెరు, మే 2: నాణ్యమైన శిక్షణ లక్ష్యానికి చేరువ చేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లోని లివింగ్ లైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ కో-ఆపరేటివ్ సంస్థ నేతృత్వంలో మూడు నెలల పాటు ఎఫ్టీసీపీ, సీఆర్ఎం విభాగాల్లో శిక్షణను అందజేశారు. ఈ శిక్షణ ముగింపు సందర్భంగా సర్టిఫికెట్లను బండ శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతీ యువకులకు పలు రంగాల్లో ఉచిత శిక్షణను అందజేస్తున్నామన్నారు. ఉపాధి కల్పించే కోర్సుల్లో ఇస్తున్న శిక్షణ వారి లక్ష్యాలను చేరువ చేస్తున్నదన్నారు. ఎస్సీలకోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు వంటి విశిష్ఠమైన పథకాలను అందజేస్తున్నదన్నారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ సర్కార్ ఎస్సీలను ప్రోత్సహిస్తున్నదన్నారు. ప్రతి ఎస్సీ యువతీ, యువకుడు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉన్నత విద్యవైపు ఎస్సీలు అడుగులు వేయాలన్నారు.
లివింగ్ లైట్ ఫౌండేషన్ ఇస్తున్న శిక్షణ అత్యుత్తమంగా ఉందని కొనియాడారు. నిరుద్యోగ యువతీ యువకులు ఏదో ఒక రంగంలో నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. స్వయం ఉపాధిని కోరుకునేవారికి ఎస్సీ కార్పొరేషన్ ప్రోత్సహిస్తుందన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలకోసం ప్రయత్నించడంతో పాటు స్వయం ఉపాధి కోసం ముందుకు రావాలన్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎయిర్టెల్, ఫ్లిప్‌కార్ట్, స్పర్కిల్ వంటి సంస్థల్లో ఉపాధి లభించడంపై సంస్థను ఆయన అభినందించారు. విద్యార్థులు జీవితంలో చక్కగా రాణించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్‌కుమార్, సంగారెడ్డి జిల్లా ఈడీ బాబూరావు, లివింగ్లైట్ ఫౌండేషన్ డైరెక్టర్ ధీరజ్, ఇస్నాపూర్ బ్రాంచ్ మేనేజర్ ఓలేటీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.