మెదక్/సంగారెడ్డి, మే 1: ఎండలు మండిపోతున్నా యి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భానుడు తన విశ్వరూపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం 11 గంటలు దాటగానే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మా రుతున్నాయి. సాయంత్రం 7గంటల వరకు ఎండల ప్రభావం తగ్గడం లేదు. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు, ఉపాధి కూలీలు, వీధి వ్యాపారులు, కార్మికులు ఎండలకు బెంబేలెత్తుతున్నారు. గ్రామాల్లో వృద్ధులు, పసిపిల్లలు అల్లాడుతున్నారు. ఎండలకు తోడు ఉక్కపోతతో బేజారవుతున్నారు. మే ప్రారంభంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. వడగాలులకు ప్రజలు రోడ్డు మీదికి రావాలంటేనే జంకుతున్నారు.
వడదెబ్బతో జాగ్రత్త
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. ఎం డల్లో తిరిగితే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. తీవ్రస్థాయిలో వడదెబ్బ తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో శరీర ఉష్ణోగ్రత 40.5 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉన్నప్పుడు నియంత్రించే మెదడులోని కేంద్రం దెబ్బతినడంతో వడదెబ్బకు గురవుతారని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు త్వరగా వడదెబ్బ బారిన పడతారని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ఎండలో తిరగకూడదని సూచిస్తున్నారు.
అత్యవసరమైతేనే బయటకు రావాలి
ఎండలతో తీవ్ర ఉక్కపోత. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పండ్ల రసాలు, శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు తాగుతున్నారు. ఉదయం, సా యంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
42.5 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత…
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఆరు రోజులుగా 41.8 నుంచి 43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఆదివారం 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల నుంచి రక్షణకు గొడుగులు, టవల్స్, టోపీలు ఉపయోగిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
వేసవిలో ఎండ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. సాధ్యమైంత వరకు ప్రతిఒక్కరూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలని, కూల్‌డ్రింక్స్‌కు బదులు మజ్జిగ, పండ్లరసాలు తాగడం ఉత్తమమని పేర్కొంటున్నారు. ఎండ నుంచి ఇంటికి వచ్చిన వారు నిమ్మరసం తాగాలని, ఉపశమనం కోసం కర్బూజా, దోసకాయలు, ఇతర పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎండలతో తస్మాత్ జాగ్రత్త..!
ఎండల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నందున ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని, వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నదని గుర్తుచేశారు. అధిక జనాలు ఉండే ప్రాంతాల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలని, సరిపడే ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని, క్రమం తప్పకుండా నీరు పోయాలని స్పష్టం చేశారు. పశువుల దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించాలని సూచించారు.