మెదక్ జిల్లా న్యూస్ నెట్వర్క్, మే 1 : మెదక్ జిల్లావ్యాప్తంగా మేడే వేడుకలను కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆదివారం ఊరూరా నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు తమతమ యూనియన్ల జెండాలను ఆవిష్కరించి, అమరులైన కార్మికులతోపాటు కార్మిక నాయకులకు నివాళులర్పించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినదించారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తుఫ్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పట్టణాలు, మండలకేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల పేరిట కార్మికుల హక్కులను హరించడం అన్యాయమన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులకు వేతన చట్టం, పింఛన్, బీమా, ఉద్యోగ భద్రత, ఉచిత విద్యావైద్యం ఇతర సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. టీఆర్కేవీఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఎస్‌ఈఈయూ, హమాలీ, భవన నిర్మాణ కార్మిక సంఘాలు మేడే వేడుకలను నిర్వహిస్తూ జెండావిష్కరణ చేశారు. రంగంపేట, తుక్కాపూర్‌లో పారిశుధ్య కార్మికులు మేడే నిర్వహించారు.