మెదక్, ఏప్రిల్ 25: ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని, గైర్హాజర్ అయితే కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ హెచ్చరించారు. గత ప్రజావాణికి, ఈ ప్రజావాణికి గైర్హాజరైన జిల్లా అటవీ శాఖాధికారికి మెమో జారీ చేయాలని కలెక్టరేట్ ఏవో మన్నాన్‌కు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులనుద్ధేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారన్నారు. ఆ సమస్య పరిష్కారానికి కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దని సూచించారు.
ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నందున దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు అందుబాటులో ఉండి అంకిత భావంతో పనిచేయాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యూటేషన్, భూ నష్టపరిహారం, పింఛన్లు, రేషన్ బియ్యం, మూడు చక్రాల సైకిళ్లు, ఉద్యోగాలు ఇప్పించమని తదితర సమస్యలతో 36 విజ్ఞప్తులు వచ్చాయి. అదనపు కలెక్టర్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీనివాస్‌లు వినతులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ, తగాదాలు, ఆస్తి గొడవలపై కేస్ ఫైల్ చేయాలని, కోర్టును ఆశ్రయించాలని సూచించారు.
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి : మెదక్ అదనపు ఎస్పీ బాలస్వామి
మెదక్ రూరల్, ఏప్రిల్ 25: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు మెదక్ అదనపు ఎస్పీ డా.బి.బాలస్వామి పేర్కొన్నారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలు విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధింత అధికారులకు సూచించారు. మెదక్ పట్టణంలోని దాయర వీధికి చెందిన అనరాసి యశోదకు పాపయ్యతో 18 ఏండ్ల క్రితం పెండ్లయ్యిందని, తమకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని, తన భర్త చెడు వ్యసనాలకు బానిసై అప్పులు చేసి, 18 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. అప్పటి నుంచి తాను తన పిల్లలతో నర్సిఖేడ్‌లో కిరాయి ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుని పిల్లలను పోషించుకుంటున్నానని చెప్పింది. తనని, పిల్లలను అత్త వారి కుటుంబ సభ్యులు ఇంటికి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టపరమైన న్యాయం చేయాలని మెదక్ పట్టణ సీఐకి సూచించారు. హవేళీఘనపూర్ మండలం తొగుట గ్రామానికి చెందిన కుర్మ మోహన్ నుంచి నగదు తీసుకుని పొలం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకుండా, పంట సాగు చేసుకోనీయకుండా నష్ట పర్చిన వారిపై చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారునికి తగిన న్యాయం చేయమని హవేళీఘనపూర్ ఎస్సైకి సూచించారు.