చిలిపిచెడ్, ఏప్రిల్ 23: ఒకప్పుడు వానలు కురిస్తేనే పం టలు పండించే వారు. యాసంగిలో సాగంటే సాహసమే. ఎందుకంటే ఎండ కాలంలో వాగుల్లో చుక్కనీరు ఉండేది కాదు. దీంతో ఆయా వాగుల కింద ఉన్న సుమారు వందల ఎకరాల ఆయకట్టు భూములు బీళ్లుగా దర్శనమిచ్చేవి. ఇప్పడు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో వాగుల్లో పరిస్థితులు మారాయి. మండలంలోని చిట్కుల్, చండూర్, ఫైజాబాద్, అజ్జమర్రి గ్రామాల శివారులోని మంజీరా నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లతో భూగర్భ జలాలు పెరుగనున్నాయి. చిట్కుల్ శివారులోని చెక్‌డ్యామ్ పూర్తి కావడంతో సుమారుగా 4కిలో మీటర్ల దూరం నీరు ఆగినవి. దీంతో చిట్కుల్ గ్రామంతోపాటు చండూర్, బద్రియ తండా, సంగారెడ్డి జిల్లా అందోల్ మండల రోళ్లపాడ్, చింతకుంట, అన్నాసాగర్ గ్రామాల రైతులకు ఎంతో ఉపయోగపడుతాయి. రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. గ్రామ శివారులో చెక్‌డ్యామ్ పూర్తి కావడంతో యాసంగిలో రైతులు వేసిన పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతున్నది. ప్రస్తుతం ఎండ లు మండిపోతున్నా చెక్‌డ్యామ్‌లు నీటితో కళకళలాడుతున్నా యి. గ్రామాల్లోని రై తులు గోధుమ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలు వేయ గా వీటికి నీరు పుష్కలంగా అందుతున్నది.
రూ.29.19 కోట్లతో నిర్మాణాలు
మంజీరా నదిపై చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్లో రూ.7.64 కోట్లు, చండూర్లో రూ.8.14కోట్లు, ఫైజాబాద్ వద్ద రూ.4.75 కోట్లు, అజ్జమర్రి వద్ద రూ.8.06 కోట్లతో చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నారు.
చెక్‌డ్యామ్ నిర్మాణాలు ఇలా
నదిలో అడ్డంగా 200 మీటర్ల పొడవునా, 2 మీటర్ల ఎత్తు, 3 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతుతో చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నారు. నీరు నిల్వ ఉండేందుకు రెండు వైపులా రెండు మీటర్ల ఎత్తులో మూడు మీటర్ల పొడవునా వరదకట్టు కట్టారు. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం 3 ఎంపీఎఫ్టీ మిలియన్ క్యూబిక్ వరకు ఉంటుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. చెక్ డ్యామ్‌లో నీరు నిండిన తర్వాతపై నుంచి నీరు ఎత్తిపోస్తే నది లోతుగా, గుంత పడకుండా ఉండేందుకు 100 మీటర్ల పొడవునా 20 మీటర్ల వెడల్పుతో మత్తడి నిర్మించారు. ఇలా నిర్మించిన చెక్‌డ్యామ్‌లో అర టీఎంసీ నీరు నిల్వ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నీటితో యాసంగి పంటకు సుమారు వంద ఎకరాలకు సాగునీరందతుందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో చెక్‌డ్యామ్ నిర్మాణం
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మంజీరా నదిపై నర్సాపూర్ నియోజకవర్గంలో 14 చెక్‌డ్యామ్‌లు మంజూరై పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ఆరు చెక్‌డ్యామ్‌ల నిర్మాణా లు పూర్తియ్యాయి. చిలిపిచెడ్ మండలం చిట్కుల్ చెక్‌డ్యామ్ నిండుకుండ లా ప్రహహించడం సంతోషంగా ఉం ది. మిగితా చెక్‌డ్యామ్‌లు పూర్తైతే నీటి సమస్య ఉండదిక. మం జీరా నుంచి కౌడిపల్లి పెద్దచెరువును నింపడానికి ప్రయత్నా లు చేస్తున్నాం. గోదావరి, సింగూర్ నీటితో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం.
– చిలుముల మదన్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
నీటి సమస్య తీరింది..
రైతులు ఎక్కువగా బోర్ల మీద ఆధారపడి సాగుచేస్తుండడంతో యాసంగి వచ్చిందంటే నీటికి ఇబ్బంది పడాల్సి వచ్చేది. భూగర్భ జలాలను పెంచేందుకు పక్కనే మంజీరా నదిలో చెక్‌డ్యామ్ మంజూరు చేయాలని గ్రామస్తులందరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ని కోరడంతో వెంటనే స్పందించి రూ.7.60కోట్లతో మంజూరు చేసి చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడం సంతోషంగా ఉంది. చెక్‌డ్యామ్ నిర్మాణంతో నీటి సమస్య తీరింది.
– గోపాల్‌రెడ్డి, చిట్కుల్ సర్పంచ్
సాగునీరందేలా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం
ఇరిగేషన్ శాఖ ద్వారా చిలిపిచెడ్ మండలంలో యాసంగి సాగునీరందేలా చెక్‌డ్యామ్‌లు నిర్మించాం. సాగు నీటి కోసం, భూగర్భ జలాలను పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. దీంతో మండలంలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. మంజీరా నదిపై అజ్జమర్రి, ఫైజాబాద్, చండూర్, చిట్కుల్లో నిర్మించిన చెక్‌డ్యామ్‌లతో యాసంగిలో సాగునీరు పుష్కలంగా అందుతున్నది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– ప్రదీప్‌రెడ్డి, చిలిపిచెడ్ మండల ఇరిగేషన్ ఏఈ
వృథా నీటిని ఆపుతున్నరు..
మంజీరా నదిపై చెక్‌డ్యామ్‌తో పంటలకు నీరందుతున్నది. నదిలో నీరు వృథాగా పోకుండా అడ్డుకట్ట నిర్మించారు. చెక్‌డ్యామ్‌లతో నీరు నిల్వ ఉంటుంది. ఆ నీటితో చుట్టుపక్కల రైతులు వేసిన పంటలకు సాగునీరు అందుబాటులోకి వస్తున్నది. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు.
– బాలయ్య, రైతు చిట్కుల్