జహీరాబాద్, ఏప్రిల్ 22: చెరుకు రైతుల సమస్యలు పరిష్కారించి, పంట సాగును పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర షుగర్ కేన్ డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని సీడీసీ కార్యాలయంలో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ, సంగారెడ్డి గణపతి షుగర్ ఫ్యాక్టరీ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే సీజన్లో రైతులు సాగు చేస్తున్న చెరుకు పంటను అగ్రిమెంట్ చేసేందుకు చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ ఏడాది జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ (బి)లో ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీలో 2.7 లక్షల చెరుకు, సంగారెడ్డి గణపతి షుగర్ ఫ్యాక్టరీ 3.87 లక్షల చెరుకును క్రషింగ్ చేసిందన్నారు. ట్రైడెంట్ షుగర్ 10.98 రికవరీ, గణపతి షుగర్ రికవరీ 11.65 వచ్చిందన్నారు.
ప్రభుత్వం టన్నుకు రూ.2,900 మద్దతు ఇవ్వగా, ట్రైడెంట్ యాజమాన్యం టన్నుకు రూ.3,050 మద్దతు ధర ఇచ్చిందన్నారు. ట్రైడెంట్ యాజమాన్యం రైతులకు రూ.63.23 కోట్లు చెల్లించవలసి ఉండగా, రైతులకు రూ.52 కోట్లు చెల్లించారన్నారు. ట్రైడెంట్ యాజమాన్యం రైతులకు రూ.10.75 కోట్లు చెల్లించవలసి ఉందని, మే 10 వరకు డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సంగారెడ్డిలోని గణపతి షుగర్ ఫ్యాక్టరీ రైతులకు 92శాతం డబ్బులు చెల్లించారని తెలిపారు. జహీరాబాద్ జోన్ పరిధిలోని 6900 ఎకరాల్లో చెరుకు పంటను రైతులు సాగు చేసి 7 లక్షల టన్నుల ఉత్పత్తి చేశారన్నారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలకు ట్రైడెంట్ పరిధిలో మిగిలిపోయిన 4 లక్షల టన్నుల చెరుకును కామారెడ్డి జిల్లాలో ఉన్న మాగి, గాయత్రి షుగర్, సంగారెడ్డి గణపతి షుగర్ ఫ్యాక్టరీలకు తరలించారన్నారు. ఈ ఏడాది జహీరాబాద్ జోన్లో 18 వేల ఎకరాల్లో చెరుకు పంట సాగు చేస్తున్నారనే అంచనా వేశామన్నారు. రైతులకు సీడీసీ ద్వారా సబ్సిడీపై గడ్డి మందు, పురుగుల మందులు పంపిణీ చేస్తున్నారన్నారు. చక్కెర, మిలసిస్ అమ్మకాలు చేయగానే రైతులకు డబ్బులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.
చెరుకు క్రషింగ్‌కు మంత్రి హరీశ్‌రావు కృషి
– సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్
ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ చేసేందుకు ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృషి చేశారని జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ తెలిపారు. రెండు సంవత్సరాలు ట్రైడెంట్‌లో చెరుకు క్రషింగ్ చేయకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్యను పరిష్కారం చేశారన్నారు. సీజన్లో చెరుకు కోసేందుకు వచ్చిన కూలీల ఎద్దులు దొంగతనానికి గురికావడంతో వారికి సీడీసీ ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర అసిస్టెంట్ కేన్ కమిషనర్ శ్రీనివాస్, సంగారెడ్డి కేన్ కమిషనర్ రాజశేఖర్, కేన్ ఇన్స్పెక్టర్ రమణి, సీడీసీ డైరెక్టరులు జి.నర్సింలు, శంకర్‌రెడ్డి, ట్రైడెంట్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణరెడ్డి, జీఎం బసవయ్య, సంగారెడ్డి గణపతి అధికారులు కృష్ణామోహన్, రామారావు, అధికారులు పాల్గొన్నారు.