నర్సాపూర్, ఏప్రిల్ 22;నేటి సమాజంలో పేదలకు సాయం చేయడానికి ఎన్నో సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. పేదలకు అండగా ఉండటంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకంగా మారింది. పేద విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్కులు తదితర స్టేషనరీ సామగ్రిని అందిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. ఇం కొంత మంది దాతలు ముందుకు వచ్చి పాఠశాలల్లో టైబ్రరీ, ల్యాబ్స్, ఫర్నిచర్ తదితర సామగ్రిని అందిస్తూ సేవా ధృక్పధాన్ని చాటుతున్నారు. ఇదే కోవలో సామాజికవేత్త చిక్కు మురళీమోహన్ స్థాపించిన సాధన స్వచ్ఛంద సంస్థ గత కొంత కాలంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, సేవా దృక్ప ధాన్ని చాటుతున్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన చిక్కు మురళీమోహన్ సమాజంలోని బాలకార్మికుల అవస్థలను చూసి చలించిపోయి బాలకార్మికులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో సాధన అనే పేరుతో 1993లో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. బాలకార్మిక విధానం, బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంతటితో తన సామాజిక సేవ ను ఆపకుండా పేద విద్యార్థులకు, పాఠశాలలకు తనకు తోచిన విధంగా సాయం చేస్తూ, అందరి ప్రశంసలను పొందుతున్నారు. ప్రస్తుతం కుమారుడు చిక్కు రాహుల్ సంస్థ బాధ్యతలను తీసుకొని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
వికారాబాద్, తాండూర్, నర్సాపూర్ ప్రాంతాల్లో తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ, పలువురికి ఆదర్శంగా మారాడు. ముఖ్యంగా పాఠశాలలో లైబ్రరీ, ల్యాబ్, ఫర్నిచర్ తదితర సామగ్రిని అందించి తన ఉదారతను చాటుకుంటున్నాడు. గ్రామాల్లో పర్యటిస్తూ, యువకులకు క్రీడా సామగ్రి వాలీబాల్, క్రికెట్ కిట్లను ఉచితంగా అందజేసి, క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు. యువకులకే కాకుండా బాలికల కోసం బాలిక సంఘాలను ఏర్పాటు చేసి వారిలో బాల్యవివాహాలు, నిర్భయ చట్టం, షీటీం తదితర చట్టాలపై ఐసీడీఎస్ వారి సహకారంతో అవగాహన కల్పిస్తున్నారు.
సేవయే కాదు.. చైతన్యం కూడా రావాలి
సమాజానికి సేవ చేయడమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కూడా చాలా అవసరం. ప్రజలకు చట్టాలపై పూర్తిగా అవగాహన కల్పిండచం కోసం సాధన సంస్థ ద్వారా పాటుపడుతున్నాం. గ్రామాల్లోని యువకులకు నాయకత్వ లక్షణాలను నేర్పిస్తూ గ్రామాభివృద్ధ్దికి పాటుపడేలా పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. పేద విద్యార్థులకు అండగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టాం. కరోనా సమయంలో కూడా శానిటైజర్లు, మాస్కులను అందజేసి కరోనాపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాం. ప్రస్తుతం యువకులకు క్రీడా సామగ్రిని అందజేస్తూ వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నాం. సాధన స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు మునుముందు కొనసాగిస్తూనే ఉంటాం.
-చిక్కు రాహుల్, సాధన స్వచ్ఛంద సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్