నారాయణఖేడ్, ఏప్రిల్ 22: మే 23వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలని సంగారెడ్డి విద్యాధికారి నాంపల్లి రాజేశ్ సూచించారు. శుక్రవారం నారాయణఖేడ్ బాలికల ఉన్నత పాఠశాలలో జోగిపేట డివిజన్ పరిధిలోని పదో తరగతి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డెవలప్మెంట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించిన సందర్భంగా మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించే బాధ్యత సీఎస్‌లు, డీవోలపైనే ఉందన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఏమాత్రం లోటుపాట్లు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా చేపట్టాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో జోగిపేట డివిజన్ పరిధిలోని నారాయణఖేడ్, కల్హేర్, మనూరు, కంగ్టి, సిర్గాపూర్, నాగల్గిద్ద, రాయికోడ్, న్యాల్కల్ మండలాల సీఎస్‌లు, డీవోలు పాల్గొన్నారు. డీఈవో వెంట నారాయణఖేడ్ ఎంఈవో విశ్వనాథ్, ఇతర అధికారులు ఉన్నారు.
పది పరీక్షలకు 73 కేంద్రాలు
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 22: మే 23 నుంచి జూన్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 73 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మెదక్ జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ పేర్కొన్నారు.కలెక్టరేట్ ఆడిటోరియంలో పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు నిర్వహించిన ఒక రోజు పునశ్చరణ శిక్షణ తరగతుల్లో పరీక్షల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రమేశ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 11,399 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్నారన్నారు. ఇందుకోసం 73 పరీక్ష కేంద్రాల్లో ఒక్కో కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లో సీటింగ్ ఏర్పాట్లు, తాగునీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలన్నారు. కరోనా తర్వాత కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మొదటిసారిగా నిర్వహిస్తున్న పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం 12నుంచి 6 పేపర్లకు కుదించడంతో పాటు పరీక్ష సమయం సైతం అరగంట పెంచిందన్నారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ రామేశ్వర్ ప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సెక్టోరియల్ అధికారి సుభాష్, సూర్యప్రకాశ్, ఎంఈవోలు నీలకంఠం, యాదగిరి, బిచ్యానాయక్, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలు
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 22: 2022-23 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ఈనెల 24న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి ఈనెల 24న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పెద్ద శంకరంపేట్ మండలంలోని తిరుమలపూర్, రామాయంపేట మండలంలోని కోమటిపల్లి, చేగుంట మండలంలోని వడియారం, నర్సాపూర్ మండలంలోని జక్కపల్లి, రెడ్డిపల్లి, రేగోడ్, టేక్మాల్ మండలాల్లోని టీఎస్ మోడల్ పాఠశాలల్లో, రామాయంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
అదే విధంగా 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకి 24వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పెద్ద శంకరంపేట మండలంలోని తిరుమలాపూర్, రామాయంపేట మండలంలోని కోమటిపల్లి, చేగుంట మండలంలోని వడియారం, నర్సాపూర్ మండలంలోని జక్కపల్లి, రేగోడ్, టేక్మాల్, చిన్న శంకరంపేటలలోని టీఎస్ మోడల్ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించబడుతాయన్నారు. హాల్‌టికెట్లను telanganams.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని రమేశ్‌కుమార్ సూచించారు. పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరు కావాలన్నారు. కరోనా దృష్ట్యా తప్పని సరిగా మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.