పుల్కల్, ఏప్రిల్ 21: ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధించాలని నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయానికి తోడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సర్కారు బడులను దత్తత తీసుకుని మౌలిక వసతులు కల్పించేందుకు నాంది పలుకుతున్నారు. మండలంలోని పెద్దారెడ్డిపేట సర్పంచ్ సతీశ్పాటిల్ తన స్నేహితుల సహకారంతో పాఠశాలను మరింతగా అభివృద్ధి చేస్తున్నారు.
రూ.2.70లక్షలతో మౌలిక వసతుల కల్పన
శిథిలావస్థకు చేరిన పాఠశాలలో నూతన ఉత్సాహం ఉట్టి పడేలా, రంగు రంగులతో అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్పొరేట్ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలలో కల్పించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింగిల్ డెస్క్ బెంచీలు 55, డబుల్ డెస్క్ బెంచీలు 115, కంఫ్యూటర్లు 3, ఈకో ప్రొటెక్షన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో త్రిబుల్ డెస్క్ బెంచీలు 30, ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు 8, సత్యనారాయణ ఆధ్వర్యంలో డిజిటల్ స్క్రీన్స్ 6, ఫ్యాన్లు 12, రాకేశ్‌కుమార్ తన వంతు సహకారంగా రూ.30 వేలను పాఠశాల అభివృద్ధికి అందజేశారు.
స్నేహితుల సహకారం మరువలేనిది
మా పాఠశాల అభివృద్ధి కోసం స్నేహితులు అందించిన సహకారం మరువలేనిది. అడిగిందే తడువు తప్పకుండా మీ పాఠశాలకు ఏమి కావాలో చెప్పండి అని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. వారి మంచి మనస్సు, విద్యార్థులపై వారు చూపించిన ప్రేమను ఎప్పటికీ మరిచి పోలేం. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. వారి సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తాం.
– పోలీస్ సతీశ్ పాటిల్, సర్పంచ్, పెద్దారెడ్డిపేట
ఈశ్వరమ్మ ట్రస్ట్ సేవలు
తన నానమ్మ పేరు మీద ఈశ్వరమ్మ ట్రస్ట్ ఏర్పాటు చేసి మా సర్పంచ్ ప్రజలకు ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామంలోని పేదల కోసం గుండె సంబంధిత చికిత్సలకు హైదరాబాద్ కేర్ దవాఖాన డాక్టర్ల బృందంతో ఉచిత చికిత్సలు అందించేందుకు వైద్య శిబిరం ఏర్పాటుచేయించారు.
– పట్నం అశోక్, పెద్దారెడ్డిపేట
చాలా సంతోషంగా ఉంది
రెండేండ్ల క్రితం మా పాఠశాల శిథిలావస్థలో ఉండేది. మా సర్పంచ్ వాళ్ల స్నేహితుల సహకారంతో ఎంతో అభివృద్ధి చేయించారు. విద్యార్థుల కోసం బెంచీలు, కంప్యూటర్లు, డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. విద్యార్థుల సమస్యలను తొలగించడం సంతోషంగా ఉంది.
– గంతి నగేశ్, పెద్దరెడ్డిపేట