పాపన్నపేట, ఏప్రిల్ 21 : పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మె ల్సీ రఘోత్తంరెడ్డి తెలిపారు. గురువారం చీకోడ్ లింగాయపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తుందన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ‘మన ఊరు-మనబడి’ చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూ పొందించిందని వివరించారు. పాఠశాలకు 50 డ్యూయల్ డెస్క్‌లు అందించాలని లింగాయపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ దృష్టికి సమస్యను తెచ్చి, డ్యూయల్ డెస్క్‌లు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. చీకోడ్ పాఠశాలకు రాగానే సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని, గతంలో తాను ఇదే పాఠశాలలో పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను పని చేసిన పాఠశాలకు పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. వందశాతం ఉత్తీర్ణత సా ధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ముందుగా చీకోడ్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోము లు, మండలాధ్యక్షుడు గడీల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు గురుమూర్తిగౌడ్, నవీన్‌గౌడ్, లక్ష్మీకిష్టయ్య, నాయకులు ఏడుకొండలు, వెంకట్రాంరెడ్డి, పుల్సింగ్ డీఈవో రమేశ్, పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
వెంకటపూర్ గ్రామానికి చెం దిన పద్మయ్య తండ్రి ఆనంతయ్య వైద్యచికిత్సకు రూ.1.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీని ఎమ్మెల్యే అందజేశారు.