నర్సాపూర్, ఏప్రిల్ 20 : ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ కచ్చితంగా ఉంటుంది. కొందరు విద్యలో ముందుంటే మరికొందరికీ క్రీడలు, డ్యాన్స్, పాటలు పాడే ప్రతిభ ఉంటుంది. టాలెంట్ అనేది ఏ ఒక్కడి సొత్తు కాదని నిరూపిస్తున్నాడు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన మహేశ్‌గిరి. మొదటగా డ్యాన్స్‌లో అదరగొట్టిన గిరి నేడు మోడలింగ్ రంగంలో రాణిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నా డు. హైదరాబాద్‌లోని సో స్టార్8 ఆధ్వర్యంలో మార్చి 26న నిర్వహించిన మోడలింగ్ (మిస్టర్ అండ్ మిసెస్) పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్ నుంచి దాదాపు 200మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో మహేశ్‌గిరి ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం జుంబా ట్రైనర్‌గా పలువురికి శిక్షణ ఇస్తూనే మోడలింగ్‌లో రాణించేందుకు కష్టపడుతున్నాడు.
మహేశ్‌గిరి నర్సాపూర్ పట్టణంలోని స్థానిక ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ లో విద్యాభ్యాసం చేశాడు. చిన్నతనం నుంచే డ్యాన్స్‌ను తన సొంతం చేసుకొని స్థానికంగా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొన్నాడు. ప్రతి డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో ప్రథమ స్థానం పొందుతూ అందరిని ఆకర్షించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు జుంబా స్టూడియోల్లో ట్రైనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇది వరకే పలు టెలివిజన్ చానెల్స్‌లో డ్యాన్స్ ప్రోగ్రామ్‌ల్లో పాల్గొని పలువురు సీనియర్ కొరియోగ్రాఫర్ల ప్రశంసలు పొందారు.
ప్రస్తుతం జుంబా ట్రైనర్‌గా మహేశ్‌గిరి హైదరాబాద్‌లో స్థిరపడ్డప్ప టికీ నర్సాపూర్‌కి వచ్చి కుటుంబసభ్యులతో గడుపుతాడు. ఎంత ఎత్తు కు ఎదిగినప్పటికీ ఒదిగి ఉండటం తన లక్ష్యం అంటాడు. తమను ఎప్పుడైనా కలిస్తే అందరూ తనలాగే ఎదగాలని చెబుతుంటాడని అతడి స్నేహితులు అంటున్నారు. ఎదగడానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇస్తాడన్నారు. మహేశ్‌గిరి చిన్నప్పటి నుంచి పట్టుదల, స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చాడని మహేశ్‌గిరి స్నేహితులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మోడలింగ్‌లో ప్రథమస్థానంలో గెలుపొందటం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్ల కృషి, పట్టుదల ఈ విజయానికి కారణం. చిన్నప్పటి నుంచి వెన్నుతట్టి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మిత్రబృందానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా మా నాన్న చందన్గిరి ప్రోత్సాహంతో ఈ స్థాయికి రాగలిగాను. నా మిత్రుడు నవీన్‌కుమార్ నా ప్రతిభను చూసి నన్ను ఈ రంగంలోకి వచ్చేలా మా నాన్నను ఒప్పించాడు. మున్ముందు ఇంకా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటాననే నమ్మకం ఉంది.
– మహేశ్‌గిరి, డ్యాన్సర్, మోడల్
మహేశ్‌గిరి డ్యాన్స్ నేర్చుకోవడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు. అనుక్షణం డ్యాన్స్ గురించే ఆలోచించేవాడు. నర్సాపూర్‌లో పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ వచ్చిన డబ్బులతో హైదరాబాద్‌లో జుంబాలో శిక్షణ పొంది ట్రైనర్‌గా ఎదిగాడు. డ్యాన్స్‌తో పాటు మోడలింగ్‌లో రాణిస్తుండడం సంతోషంగా ఉంది. మహేశ్‌గిరి మరిన్ని విజయాలను సాధించి, అత్యున్నత స్థానానికి ఎదుగాలని కోరుకుంటున్నా.
– మన్నె నవీన్‌కుమార్, మహేశ్‌గిరి స్నేహితుడు