కోహీర్, ఏప్రిల్ 19 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కోహీర్ మండలంలోని బిలాల్పూర్లో రూ. 58.50 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో మందుల కొనుగోలుకు రూ. 200 కోట్లు కేటాయించామన్నారు. కానీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత బడ్జెట్లో రూ. 500 కోట్లను వెచ్చించామని చెప్పారు. కోహీర్ పట్టణంలో రూ. 11.50 కోట్ల వ్యయంతో చేపట్టిన దవాఖానను మూడు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మండలానికి 9 సబ్ సెంటర్లను మంజూరు చేశామన్నారు. ఒక్కొ సబ్ సెంటర్‌ను రూ. 20 లక్షల ఖర్చుతో నిర్మిస్తామన్నారు. సంబంధిత వైద్య సిబ్బంది సబ్సెంటర్లోనే ఉంటూ వైద్యసేవలను అందించాలని సూచించారు. గర్భిణులకు ప్రతి గ్రామంలో 12వారాలకు మొదటి ఏఎన్సీ చికిత్స చేయాలని ఆదేశించారు. నాలుగుసార్లు కచ్చితంగా ఏఎన్సీ చికిత్సలు చేయించాలన్నారు. జహీరాబాద్‌లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నదని ఇందు కోసం ప్రత్యేకంగా రూ. 11 కోట్ల వ్యయంతో మాతాశిశు సంక్షేమ దవాఖానను నిర్మిస్తామని హామీనిచ్చారు. త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు.
పౌష్టికాహారాన్ని అందించాలి
ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవాలు చేయించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులకు పాలు, గుడ్డు, ఐరన్ మాత్రలు సకాలంలో అందించాలన్నారు. పౌష్టికాహారం అందించకుంటే బిడ్డ బలంగా ఉండదన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు కలిసి నెలకు రెండుసార్లు 1, 15వ తేదీన కచ్చితంగా సమావేశం కావాలన్నారు. రక్తహీనత రాకుండా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని కోరారు. లేకుంటే మాతా, శిశు మరణాలు పెరుగుతాయన్నారు. వందశాతం ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు చేయించాలన్నారు. ప్రభుత్వ దవాఖానలో మాత్రమే కేసీఆర్ కిట్ లభిస్తుందన్నారు. ప్రైవేటు దవాఖానలో అయితే రూ. 70వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వ దవాఖానలో పాము కాటు, కుక్క కాటుకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. టీబీ రోగులకు మందులతో పాటు రూ. 500 చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. రోగులందరికీ డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది , టీకా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవిని ఆదేశించారు. యూరోపియన్ ద్వారా విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలను త్వరలో పర్మినెంట్ చేస్తామని హామీనిచ్చారు.
బిలాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ ప్రహరీని నిర్మిస్తామని, స్వీపర్, అటెండర్‌ను కూడా నియమిస్తామని వెల్లడించారు. గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లను నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య వసతుల కల్పన సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్, డీసీఎంస్ చైర్మన్ శివ కుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్‌పాటిల్, సర్పంచ్‌లు నర్సింహులు, రవికిరణ్, వెంకట్ రామిరెడ్డి, ఎంపీపీ మాధవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, సొసైటీ చైర్పర్సన్ స్రవంతి అరవింద్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అనితా నర్సింహులు, నామరవికిరణ్, గోవర్ధన్‌రెడ్డి, ఖలీం, రాజుస్వామి, శివమూర్తిస్వామి, నాగరాజు, డాక్టర్లు రాజ్‌కుమార్, వంశీ, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రైవేటు పరం చేస్తున్న కేంద్రం..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. కాళేశ్వరం జలాలు కూడా త్వరలో ఇక్కడకు రాబోతున్నాయి. మన పక్కనే ఉన్న కర్ణాటకలో ఇంతటి అభివృద్ధి ఉందా? కేంద్రప్రభుత్వం ఎల్ఐసీ, రైల్వేలు, ఏయిర్‌వేస్, తదితర వాణిజ్య సంస్థలను అమ్మివేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించాం.
-కొనింటి మాణిక్‌రావు,ఎమ్మెల్యే (జహీరాబాద్)