న్యాల్కల్, ఏప్రిల్ 19 : మట్టి అవసరం లేకుండా పంటలను హైడ్రోపోనిక్ ఆధునిక వ్యవసాయ పద్ధతిలో పండించడం బాగుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని ఖలీల్పూర్ గ్రామ శివారులోని లెమన్చిల్లి పాలీహౌస్ను ఆయన సందర్శించి, హైడ్రోపోనిక్ పద్ధతిలో పండిస్తున్న క్యాప్సికం, కీరా, కూరగాయల పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పాలిహౌజ్ కంపెనీ డైరెక్టర్ రితీష్ బాబు హైడ్రోపోనిక్ ఆధునిక వ్యవసాయ పద్ధతిలో చేస్తున్న కూరగాయల విధానం గురించి వివరించారు. సింగపూర్‌లో స్థిరపడిన యలమంచి జనార్ధన్‌రావు 2017లో 15 ఎకరాల విస్తీర్ణంలో క్రావో స్ట్రక్చర్(అడ్వాన్స్ గ్రీన్ పాలీహౌస్)ను ఏర్పాటు చేశారన్నారు. ఈ పాలీహౌస్ దక్షిణ ఆసియాలోనే అతిపెద్దదన్నారు. వ్యవసాయం చేయలంటే సారవంతమైన భూమి అవసరం ఉంటుందన్నారు. అందులో పోషకాలున్న మట్టి కావాలి.. ఇందంతా పాతవ్యవసాయ పద్ధతన్నారు. చేతికి మట్టి అంటే పనిలేదు.. వానలు కురవలేదన్న బాధ లేదు.
కలుపు మొక్కల దిగులు, చీడపురుగుల బెడద కూడాఉండదన్నారు. ఆధునిక వ్యవసాయ విధానంలో ఒకటైన హైడ్రోపోనిక్ పద్ధతిని అనుసరిస్తూ ఎక్సయోటిక్ కలర్ క్యాప్సికం, ఇంగ్లిష్ కీరా, పుచ్చ, కర్భుజా, జుకునీ, చెర్రీ, టమాటో పంటలను పండిస్తున్నామన్నారు. కూరగాయలు, పండ్లు నాణ్యత బాగుంటుందని, దేశీయ, విదేశీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న క్యాప్సికం, కీరా పంటలకు మంచి ధర కూడా లభిస్తుందన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ హైడ్రోపోనిక్ ఆధునిక వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, పూలను పండించడం బాగుందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం కూడా రైతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున్న నిధులను కేటాయిస్తూ, ఎంతో కృషి చేస్తుందన్నారు. పా లీహౌస్లో చేపట్టిన హైడ్రోపోనిక్ ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించి చైతన్య పర్చాలని నిర్వహకులను కోరారు. ఆయన వెంట టీఎస్ఎంఐడీసీ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఆర్డీవో రమేశ్ బాబు, మండల జడ్పీటీసీ స్వప్న భాస్కర్, లెమన్ చిల్లి ఫాలీహౌస్ మేనేజర్ బ్రహ్మ, మార్కెటింగ్ మేనేజర్ వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.