మెదక్, ఏప్రిల్ 16 : ప్రజల సమస్యల పరిష్కారానికే మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని ప్రారంభించమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమవుతుండటంతో ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని పాపన్నపేట, మెదక్ పట్టణం, హవేళీఘణాపూర్, మెదక్ మండలం, రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యేకు సమస్యలను విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలను ఓపికగా విని ఎమ్మె ల్యే అక్కడ ఉన్న అధికారులకు వివరించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు, విద్యుత్ తదితర సమస్యలను ఎమ్మెల్యేకు 80మంది లిఖిత పూర్వకంగా తెలియజేశారు. పాపన్నపేట మండలం జయపురం గ్రామస్తు లు వారి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
చాలా గ్రామాల వారు తమ గ్రామానికి దళిత బంధు పథకం కింద ఎంపిక చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భూ సమస్యలను అదనపు కలెక్టర్ రమేశ్‌తో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. విద్యు త్ సమస్యలను అవసరమున్న చోట కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలని, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతలు, ట్రాన్స్ఫార్మర్ల షిఫ్టింగ్ సమస్యలను డీఈ కృష్ణారావుకు వివరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీఈని ఆదేశించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్ధేశంతో మీ కోసం కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఆమె తెలిపా రు. కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో డీఈ కృష్ణారావు, మున్సిపల్ కౌన్సిలర్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, రైతుబంధు మండల అధ్యక్షులు గడీల శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాప సాయి లు, మెదక్ పట్టణ, హవేళీఘణాపూర్, పాపన్నపేట మండలాల పార్టీ అధ్యక్షులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.