మెదక్, ఏప్రిల్ 14 : రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉం చుకొని రూ.3వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా, సజావుగా నిర్వహించాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లాలో ధాన్యం కొనుగోలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో యాసంగి లో రైతులు కాస్త వరినాట్లు ఆలస్యంగా వేశారని, అది కూడా ధాన్యం పండించవద్దని విజ్ఞప్తి మేరకు గతేడాది కంటే ఈసారి 40 శాతం తక్కువ వేశారన్నారు. గత యాసంగిలో 4 లక్షల 42వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సారి 3 లక్షల 77వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా నేటినుంచి జిల్లాలో 330 కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిందని గ్రేడ్ ఏ రకం రూ. 1960, సాధారణ రకం రూ.1940 కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ తక్కువ ధరకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఎండాకాలం దృష్ట్యా బాయిల్డ్ రైస్ ఎక్కు వ వస్తుందని కానీ, రా రైస్(ముడిబియ్యం) కావాలని కేంద్ర ప్రభుత్వం తొండి చేస్తుందన్నారు. కేంద్రం వైఖరితో రూ.3వేల కోట్ల నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ధా న్యాన్ని కొనుగోలు చేయనుందని అన్నారు. రైతులు గన్నీబస్తాలతో పాటు టార్ఫాలిన్లు సమకూర్చుకోవాల్సిందిగా సూచించారు.
రైల్వేట్రాక్ ద్వారా ధాన్యం రవాణా చేసేలా చూడాలి..
మెదక్‌లో రైల్వే ట్రాక్ సిద్ధమైంది.. ఇక్కడి నుంచి ధాన్యం రవాణా చేయాలని మంత్రి ఆదేశించారు. గత యాసంగిలో 36 మిల్లులకు బాయిల్డ్ రైస్ తరలించడంలో ఇబ్బందులు వ చ్చినా.. ఇప్పుడు పూర్తి రా రైస్ వస్తుందని, 150 రైస్ మిల్లులకు మిల్లు కెపాసిటీ వారీగా ధాన్యం తరలించాలని సూచించారు. గతంలో బడులను గోదాములుగా ఉపయోగించామ ని, ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను గుర్తించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో డిజిటల్ కాంటాలు, ప్యాడీ క్లిన ర్లు, తేమ కొలిచే మీటర్లు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమీక్షలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలతశేఖర్‌గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, కలెక్టర్ హరీశ్, ఎస్పీ రోహిణీప్రియదర్శిని, అదనపు కలెక్టర్ రమేశ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీనివాస్, ఆర్డీవోలు శ్యాం ప్రకాశ్, వెంకటఉపేందర్రెడ్డి, డీఎస్పీ సైదులు పాల్గొన్నారు.