పుల్కల్, ఏప్రిల్ 14: మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త జోష్ నెలకొంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరిసి పోతున్నా యి. మౌలిక వసతుల రూప కల్పనే ధ్యేయంగా కొన్ని సంస్థలు ముందుకు వచ్చి బడులను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నాయి. మండల పరిధిలోని గొంగ్లూరు ప్రభుత్వ పాఠశాల ను రెండు సంవత్సరాల క్రితం 2019నుంచి ఐఆర్ఎస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సర్వోదయ గ్రామ సేవక్, రచన ట్రస్ట్ వారు మౌలిక వసతుల రూపకల్పనకు చేయూతనందించారు. విద్యాభివృద్ధి లక్ష్యంగా వారు కొన్ని గ్రామాలను ఎంచుకొని ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తున్నారు.
గొంగ్లూరు బడికి 7.50లక్షలు..
గొంగ్లూరు పాఠశాలకు సుమారుగా రూ. 7.50లక్షలు వెచ్చిం చి రూ. 4లక్షలతో పెయింటింగ్, రూ. 1.50లక్షలతో 30బెంచీ లు, రూ.25వేలతో సౌండ్ సిస్టమ్, లక్ష రూపాయలతో 10 టెబుల్స్, 500 లైబ్రరీ బుక్స్, లక్ష రూపాయలతో బిల్డింగ్ ప్యాచ్ వర్క్‌లను పూర్తి చేసి ఇవ్వడంతో ప్రస్తుతం ఆ పాఠశాల కార్పొ రేట్ పాఠశాలలకు ధీటుగా కనబడుతున్నది.
మా పాఠశాలలో ఏది తక్కువ లేదు..
ప్రస్తుతం మా పాఠశాలలో ఇప్పుడు ఇది లేదే అనే మాటే లేకుండా పోయింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మా పాఠశాలలో నూతన బెంచీలు, లైబ్రరీ, సౌండ్ సిస్టమ్ ప్రతీది మా పాఠశాలలో ఉంది అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాము.
– భాగ్యలక్ష్మి, 10వ తరగతి
సంతోషంగా ఉంది..
మా బడిని వారు దత్తత తీసుకుని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మా పాఠశాలను సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. విద్యార్థుల తరపున బృందం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– విజయ్‌కుమార్ ప్రధానోపాధ్యాయుడు
మరికొన్ని పాఠశాలలను దత్తత తీసుకుంటాం..
తెలంగాణ రాష్ట్రంలో ఐఆర్ఎస్, సర్వోదయ గ్రామ సేవక్ బృందం సభ్యుల సహకారం తో ఇప్పటికీ ఐదు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశాము. కరస్‌గుత్తి, హన్మంత్‌రావుపేట్, నిజాంపేట్, అబ్బెంద, ముదిమాణిక్యం తదితర గ్రామాలు మరికొన్ని పాఠశాలలను కూడా ఎంపిక చేసి వాటిని కూడా అభివృద్ధి చేస్తాం.
– సుధాకర్‌నాయక్, ఐఆర్ఎస్ డిప్యూటీ కమిషనర్ ఆదాయపు పన్నుశాఖ