మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 12 : సక్రమంగా పన్నులు చెల్లించే వారిని ప్రోత్సహించడంతో పాటు మున్సిపాలిటీలకు ఆదాయాన్ని సమకూర్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఒక అవకాశం కల్పించింది. ఎర్లీబర్డ్ పథకం ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపాలిటీల పరిధిలో ని ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ నెలాఖరులోపు ఆస్తి పన్ను చెల్లిస్తే ఎర్లిబర్డ్ పథకంలో భాగంగా ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ఆఫర్ ప్రకటించింది. దీంతో మున్సిపాలిటీ పరిధిలో నివాస గృహలు, వాణిజ్య సముదాయ భవనాలకు ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లిస్తే రాయితీ అందనుంది. ఈ మినహాయింపు ఈ నెల చివరి వరకు గడువుగా నిర్ణయించింది. జిల్లాలోని మెదక్‌తో పాటు రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ముందస్తు ఆస్తి పన్నులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు గాను ప్రత్యేక బృందాలు ఇంటింటికెళ్లి ఆస్తిపన్ను దారులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఏప్రిల్ 30 వరకే..
నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల పన్నుల ముంద స్తు చెల్లింపునకు సంబంధించిన ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకే వర్తిస్తుంది. ఆస్తి పన్ను రూ. లక్ష చెల్లించే వారికి రూ. 5 వేలు తగ్గింపు, రూ. వెయ్యి ఉంటే రూ. 950 చెల్లించాలి.
పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం..
ముందస్తు ఆస్తిపన్ను చెల్లించి 5శాతం రాయితీని పొందేందుకు మున్సిపల్ శాఖ అవకాశం కల్పించింది. దీనిని పన్నుదారులు సద్వినియోగం చేసుకోవాలి. రాయితీ గురించి పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. బిల్ కలెక్టర్లు ఇంటింటికీ వెళ్లి ఆస్తి పన్ను దారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సదావకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. -శ్రీహరి, మున్సిపల్ కమిషనర్
సద్వినియోగం చేసుకోవాలి
ఎర్లీబర్డ్ పథకంలో ఈ నెల 30వరకు ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించి 5శాతం రాయితీని ఆస్తి పన్నుదారులు సద్వినియోగపరుచుకోవాలి. పట్టణ ప్రజలు ఆస్తి పన్నులు చెల్లించి పట్టణ అభిృద్ధికి భాగస్వాములు కావాలి.
– చంద్రపాల్, మున్సిపల్ చైర్మన్ మెదక్