మెదక్/ రామాయంపేట, ఏప్రిల్ 12: యువత ప్రణాళికా బద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్ఐ, గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని, ఆయా పోస్టుల కోసం నియామక పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ఉచిత ఉద్యోగ శిక్షణ శిబిరాలను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం మెదక్, రామాయంపేటలో కోచింగ్ సెంటర్లను ఆమె మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని, పీజేఆర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన పీజేఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధ్యాపకుల ద్వారా బుధవారం నుంచి రెండు నెలల పాటు మెదక్ నియోజకవర్గం నుంచి మెదక్, రామాయంపేటలలో ఏర్పాటు చేస్తున్న శిబిరాల్లో శిక్షణ ఇవ్వనుండగా, 1000 మంది యువత పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ శిక్షణలో భోజనం, మెటీరియల్‌ను ఉచితంగా అందించనున్నామన్నారు.
రాష్ట్రంలో 91వేల ఉద్యోగాలను ఈ సంవత్సరం భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నదని, కాబట్టి యువత ఉచిత కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ మా కాలంలో పోటీ పరీక్షలకు సరైన గైడెన్స్, కోచింగ్ లేక ఇబ్బందులు పడ్డామని, నేటి యువత చాలా అదృష్టవంతులని పోటీ పరీక్షలకు మంచి ఫ్యాకల్టీతో ఉచిత శిక్షణ ఇస్తుండడంతో పాటు మెటీరియల్ అందిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు, రామయంపేటలో జరిగిన కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్, రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, చేగుంట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నార్సింగి, నిజాంపేట ఎస్సైలు రాజేశ్, ప్రకాశ్‌గౌడ్, సుభాశ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కల్పించిన ఉచిత కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. కోచింగ్‌కు రావడం, వెళ్లడం కాకుండా ఉద్యోగం సంపాదించాలన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్కిల్ పోలీసులు మీకు అండగా ఉంటారన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌పై శిక్షణ, అవగాహన కల్పిస్తామన్నారు.
60 రోజులు ఉచితంగా శిక్షణ ఇస్తాం: జగదీశ్వర్‌రెడ్డి, పీజేఆర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు
తమ సంస్థ తరఫున కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థులకు రెండు నెలల పాటు ఉచితంగా శిక్షణను ఇస్తామని పీజేఆర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు కష్టంగా ఉన్నా ఇష్టంగా చదివితే ఉద్యోగాన్ని సునాయాసంగా పొందవచ్చన్నారు.