మెదక్, ఏప్రిల్ 9: బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని, బాధితులకు మరింత నమ్మకం కలిగించాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో కోర్టు వారెంట్స్, సమన్స్, ఎంసీఎస్వర్టికల్ జిల్లా ఇన్చార్జి, అల్లాదుర్గం సీఐ జార్జితో కోర్టు కానిస్టేబుల్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కోర్టు కానిస్టేబుల్ అధికారులు తమ విధిలో భాగంగా ఎప్పటికప్పుడు ఎన్బీడబ్ల్యూ(నాన్ బెయిలబుల్ వారెంట్లను) క్రమం తప్పకుండా అమలు పర్చి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా కృషి చేయాలని కన్విక్షన్ రేటును పెంచాలన్నారు. సమన్లను జారీ చేయాలని సూచించారు. కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమాజంగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాలన్నారు. ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుంచి కేసు పూర్తయ్యేంత వరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు కానిస్టేబుల్ ప్రత్యేక శ్రద్ధ, బాధ్యత తీసుకోవాలని సూచించారు.
కోర్టు క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, కేసు ట్రయల్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్స్, సమన్స్, సీసీటీఎన్ఎస్లో (కోర్టు మానిటరింగ్ సిస్టం)లో డాటా ఎంటర్ చేయాలని సూచించారు. ఈ డాటాను టీఎస్ కాప్కు అనుసంధానం చేయడం జరుగుతుందని, దీనిద్వారా ప్రతీ రోజు కోర్టు ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆన్లైన్లో వెంటనే తెలుస్తుందని, కోర్టు కానిస్టేబుల్ పని సులభతరం అవుతుందని పేర్కొన్నారు. కోర్టు కానిస్టేబుళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని తెలిపారు. బాధితులకు మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని సూచించారు. సమావేశంలో మెదక్ డీఎస్పీ సైదులు, డీసీఆర్బీ సీఐ సునీల్, ఐటీ కోర్ ఇన్చార్జి కృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు నయీద్, మెదక్, తూప్రాన్ సబ్ డివిజన్ల కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.