మెదక్, ఏప్రిల్ 7: జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. రాబోయే మూడు నెలలు ఎంతో కీలకమని, ప్రజలు వీలైనంత మేర పగటిపూట ఇంటి వద్దనే గడపాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని సూచించారు. గురువారం ఎండ తీవ్రత, వడదెబ్బ మరణాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎండ తీవ్రతతో ప్రాణనష్టం వాటిల్లకుండా పక్షం రోజుల్లో పకడ్బంధీ చర్యలు తీసుకోవాలని దిశానిర్ధేశం చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పాఠశాల ముగిసిన వెంటనే విద్యార్థులు ఇంటికి వెళ్లేలా చూడాలన్నారు. వసతి గృహ విద్యార్థులు ఎండలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని డీఈవో రమేశ్‌కుమార్‌కు సూచించారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో, మున్సిపాలిటీలు, వార్డు సభ్యులు, కౌన్సిలర్ల వద్ద కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వడదెబ్బ బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించేందుకు 108, 104 అంబులెన్స్‌లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్రావుకు సూచించారు. ఉపాధి పనులను ఉదయం 6 గంటల నుంచి 11లోపు, సాయంత్రం సమయాల్లో నిర్వహించుకునేలా ప్రణాళికలు చేసుకోవాలని, కూలీలకు నీడ నిచ్చే షెడ్లు, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని డీఆర్డీవోకు సూచించారు.
మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, అవె న్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కల సంరక్షణకు ప్రతి రోజు తప్పనిసరిగా నీరుపోయలన్నారు. మూగజీవాలకు ప్రాణనష్టం వాటిల్లకుండా చూడాలని పశు సంవర్ధక శాఖ అధికారి విజయశేఖర్‌రెడ్డికి సూచించారు. జిల్లాలో 640 పశువుల నీటి తొట్టెలకుగాను 295 తొట్టెలకు చిన్న చిన్న మరమ్మతులు చేపట్టడంతో పాటు వాటిని శుభ్రపరిచి నీటి సదుపాయం కల్పించాల్సి ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పక్షులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా దుకాణాలు, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రతిమాసింగ్ సూచించారు. గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని డీపీవో తరుణ్‌కుమార్‌కు సూచించగా, ఇప్పటి వరకు 177 పెద్ద గ్రామాల్లో ఏర్పాటు చేశామన్నారు. పైపులైన్ల లీకేజీలను ఎప్పటికప్పుడు అరికడుతూ నీరందేలా చూడాలని మిషన్ భగీరథ అధికారి కమలాకర్‌ను ఆదేశించారు.
అన్ని మున్సిపాలిటీల్లో జన సమర్థ్యం గల ప్రాంతాలు గుర్తించి చలివేంద్రాలు ఏర్పా టు, పారిశుద్ధ్య సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. మెదక్‌లో 10, నర్సాపూర్, తూప్రాన్‌లో 5 చొ ప్పున కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ఇంకా అవసరమైన ప్రాంతాలను ఎంపిక చేసి చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్లు తెలిపారు. జిల్లాలోని అన్ని బస్టాండ్ ప్రాంతాల్లో శుద్ధమైన నీటిని ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పిల్లలు, గర్భిణులు, ముసలివాళ్లపై అంగన్వాడీ కేంద్రాల ద్వారా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు శ్రీహరి, మోహన్, శ్రీనివాస్, చాముండేశ్వరీ పాల్గొన్నారు.