మెదక్ రూరల్, ఏప్రిల్ 5 : ప్రభుత్వ బడుల రూపురేఖలు మారబోతున్నాయి. త్వరలో కొత్త వెలుగులు సంతరించుకోనున్నాయి. అన్నిరకాల మౌలిక వసతులు కల్పించేందుకే ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. మొదటి విడుతలో మెదక్ మండలంలో 7 పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతి పాఠశాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో దాతలను ప్రోత్సహించి, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఎంపికైన పాఠశాలలు..
‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో మొదటి విడుతగా 7 పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. మంబోజిపల్లి ప్రాథమిక పాఠశాల, మచవరం ఉన్నత పాఠశాల, రాజ్‌పల్లి ఎంపీపీఎస్, ఖాజీపల్లి ఎంపీయూపీఎస్, మక్తభూపతిపూర్ ఉన్నత పాఠశాల, తిమ్మానగర్ ఎంపీపీఎస్ పాఠశాలలను ఎంపిక చేశారు.
చేపట్టే పనులు
‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో 12 రకాల పనులు చేపట్టానున్నారు. ప్రహరీల నిర్మాణం, కిచన్ షెడ్, ఫర్నిచర్, డిజిటల్ విద్య, గ్రీన్‌చాక్ బోర్డుల ఏర్పాటు, పాఠశాలల గదులకు మరమ్మతులు, శిథిలావస్థలో ఉన్న గదులను తొలిగించి కొత్తవి నిర్మించడం, మరుగుదొడ్లు, తాగునీటి వపతి తదితర పనులు చేపట్టనున్నారు.
ప్రజల సమన్వయంతో పనిచేస్తాం
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. మొదటి విడుతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 12 రకాల పనులు చేపట్టనున్నాం. మూడు నెలల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు, ప్రజల సమన్వయం తో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
-నీలకంఠం, ఎంఈవో మెదక్
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
‘మన ఊరు-మనబడి కార్యక్రమం తో పేద విద్యార్థుల తలరాతలు మార్చే మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసిఆర్‌కు కృతజ్ఞతలు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి.
-యమునాజయరాంరెడ్డి, ఎంపీపీ, మెదక్