రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు మణిహారం కానున్నది. ఈ రోడ్డు నిర్మాణంతో రవాణా మరింత సులభతరం కానున్నది. రోడ్డు కనెక్టివిటీతో ఉమ్మడి జిల్లా పర్యాటకం, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి కానున్నది. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు ఇటీవల కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో ఉత్తరభాగంలో 158 కిలోమీటర్లు ఈ రోడ్డును నిర్మించనుండగా, ఇందులో సింహభాగం ఉమ్మడి మెదక్ జిల్లాలోనే విస్తరించి ఉంది. ఈ రోడ్డుకు సంబంధించి భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. పూర్తిగా ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మిస్తారు. ఈ రోడ్డు వస్తుండడంతో భూములు మరింత పిరం అవుతున్నాయి. గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, అందోల్, జోగిపేట ఆర్డీవోలు భూసేకరణ చేపట్టనున్నారు.
మెదక్/సంగారెడ్డి/గజ్వేల్ రూరల్, ఏప్రిల్ 3 : రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ రోడ్డుకు సంబంధించి భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. నిర్మాణం మొత్తం కేంద్ర నిధులతో సాగనుంది. పూర్తిగా ఎక్స్‌ప్రెస్ వేగా, రెండు భాగాలుగా నిర్మించే ఉత్తర భాగానికి కేంద్రం గతేడాది ఆమోదం తెలిపింది. ఉత్తర భాగం భూసేకరణకు అనుమతి లభించినందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భూములను గుర్తించనున్నారు.ఈ రోడ్డు పూర్తయితే హైదరాబాద్‌తో అనేక జిల్లాలు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ నివాసం ఉండేందుకు సెలబ్రటీలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే రోడ్ కనెక్టవిటీ పెరిగి మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది.
మెదక్ జిల్లాలో 36 గ్రామాల మీదుగా…
మెదక్ జిల్లాలో తూప్రాన్ మండల పరిధిలో వట్టూరు, జండపల్లి, నాగులపల్లి, ఇస్లాంపూర్, దాతర్పల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్, వెంకటాయిపల్లి, కిష్టాపూర్, నర్సంపల్లి, తూప్రాన్ గ్రామాలు కాగా, నర్సాపూర్ ఆర్డీవో పరిధిలో కౌడిపల్లి మండలం వెంకటాపూర్, శివ్వంపేట మండలంలోని లింగోజిగూడ, పాంబండ, పోతులబోగుడ, కొంతాన్‌పల్లి, గుండ్లపల్లి, ఉసిరికపల్లి, రత్నాపూర్, కొత్తపేట, నర్సాపూర్ మండలంలోని నాగులపల్లి, మూసాయిపేట, మహ్మదాబాద్ లేదా జానకంపేట, రెడ్డిపల్లి, ఖాజీపేట, తిరుమలాపూర్, గొల్లపల్లి, అచ్చంపేట, చిన్నచింతకుంట, పెద్దచింతకుంట, సీతారాంపూర్, రుస్తుంపేట్, మంతూర్, మల్పర్తి, తుజాల్పూర్ గ్రామాల మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు వెళ్లనుంది. హైదరాబాద్‌లోని బాలానగర్, దుండిగల్, గుమ్మడిదల మీదుగా నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, మెదక్ వరకు ఇప్పటికే హైవేను నిర్మించారు. ఇప్పుడు మెదక్ జిల్లా మీదుగా ఆర్ఆర్ఆర్ వెళ్తుండడంతో మెదక్ జిల్లాకు మరో మణిహారం కానుంది. మెదక్ జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్ ఆర్డీవో పరిధిలో భూసేకరణ చేపడతారు.

సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట, చౌటకూరు, హత్నూర మండలాల్లోని 20 గ్రామాల గుండా రీజనల్ రింగ్ రోడ్డు వెళ్లనున్నది. జిల్లాలో సంగారెడ్డి, జోగిపేట ఆర్డీవోల పర్యవేక్షణలో ఆర్ఆర్ఆర్ భూసేకరణ జరుగనున్నది. ఆర్ఆర్ఆర్ సంగారెడ్డి జిల్లాలోని 20 గ్రామాల గుండా వెళ్లనుంది. సంగారెడ్డి మండలంలోని సంగారెడ్డి, నాగాపూర్, ఇర్గిపల్లి, చింతల్‌పల్లి, కల్పగూరు, కులబ్గూరు మీదుగా రీజనల్ రింగురోడ్డు వెళ్లనుంది. సదాశివపేట మండంలోని పెద్దాపూర్, కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్, మల్కాపూర్ మీదుగా ఆర్ఆర్ఆర్ వెళ్తుంది. హత్నూర మండలంలోని కాసాల, దేవులపల్లి, హత్నూ ర, దౌల్తాబాద్, సికిందర్‌పూర్ మీదుగా ఆర్ఆర్ఆర్ వేయనున్నారు. చౌటకూరు మండలంలోని శివ్వంపేట, వెండికోల్, అంగడి వెంకటకిష్టాపూర్, లింగంపల్లి, కోర్పోల్ మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు వెళ్లనుంది. రీజనల్ రింగ్ రోడ్డు వెళ్లే ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం రియల్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలోని రాయపోల్, వర్గల్, గజ్వేల్, మర్కూక్, జగదేవ్‌పూర్ మండలాల్లోని గ్రామాల మీదుగా రీజినల్ రింగ్‌రోడ్డు వెళ్లనుంది. రెండు నెలల క్రితం భూసేకరణ కోసం డ్రోన్ ద్వారా భూములను పరిశీలించారు. ఆ తర్వాత వర్గల్, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లోని గ్రామాల్లో హద్దులు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని రాయపోల్ మండలంలో బేగంపేట, ఎల్కల్, వర్గల్ మండలంలోని మజీద్‌పల్లి, నెంటూర్, జబ్జాపూర్, మైలారం, కొండయిపల్లి, గజ్వేల్ మండలంలోని బంగ్లావెంకటాపూర్, మక్తమాసాన్‌పల్లి, కొమటిబండ, గజ్వేల్, సంగాపూర్, ముట్రాజ్‌పల్లి, ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లి, మర్కుక్ మండలంలోని పాములపర్తి, మర్కూక్, అంగడికిష్టాపూర్, చెబర్తి, ఎర్రవల్లి, జగదేవ్‌పూర్ మండలంలోని అలిరాజ్‌పేట, ఇటిక్యాల, పీర్లపల్లి గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ వెళ్తుంది. ఈ గ్రామాల్లో సర్వేచేసిన అధికారులు ఇప్పటికే హద్దులను ఏర్పాటు చేశారు. ఆర్ఆర్ఆర్కు సంబంధించిన భూసేకరణలో హద్దులను ఏర్పాటు చేయడంతో వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం భూమికి రూ.కోటి నుండి కోటిన్నర వరకు ధర పలుకుతున్నది. వర్గల్, మర్కూక్ మండలాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. మర్కూక్ మండలం పాములపర్తి వద్ద కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఉండడంతో ఇక్కడి భూములు కొనుగోలుకు అందరూ కనబరుస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తొలి గెజిట్ (3ఎ) విడుదల..
రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి తొలి గెజిట్(3ఎ) విడుదలైంది. ఈ ప్రాజెక్టు ఉత్తర భాగం 158.64 కిలోమీటర్లకు సంబంధించి కావాల్సిన భూసేకరణలో భాగంగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది అధికారులతో అథారిటీని ఏర్పాటు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌తో సహా చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేట ఆర్డీవోలు ఈ అథారిటీలో ఉన్నారు. ఏయే గ్రామాల నుంచి భూమిని సేకరిస్తారో తెలుపుతూ గెజిట్‌ను ఢిల్లీలోని ఎన్హెచ్ఎం అధికారులు గురువారం విడుదల చేశారు. మొత్తం 113 గ్రామాల పేర్లను అందులో పొందుపర్చారు. ఈ ఉత్తర భాగానికి సంబంధించి రూపొందించిన తుది అలైన్మెంట్ మ్యాప్‌ను విడుదల చేశారు. ఈ భాగంలో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఇతర రహదారులను రీజినల్ రింగ్ రోడ్డు క్రాస్ చేస్తోంది.
త్వరలో భూ సేకరణ ప్రక్రియ..
రీజినల్ రింగ్ రోడ్డులో భూనిర్వాసితులకు నోటీసులు, పరిహారం తర్వాత భూముల సేకరణ ప్రక్రియ మొదలు కానుంది. నెల రోజుల్లో సర్వే పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ ఫేజ్(నార్త్ ఫేజ్)ను రూ.7.512 కోట్ల ఖర్చుతో 158.64 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఇందుకోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 4,620 ఎకరాల భూమి అవసరమని ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన రోడ్డు అలైన్‌మెంట్‌ను ఇప్పటికే ఒకే చేశారు. దీని ప్రకారం మెదక్ జిల్లాలోని నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట, తూప్రాన్, మాసాయిపేట మండలాల పరిధుల మీదుగా ఆర్ఆర్ఆర్ పోతుంది. ఈ క్రమంలో మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద భారీ సర్కిల్ నిర్మించనున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ఫేజ్ అలైన్మెంట్ ఒకే కావడంతో ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పల్లెల్లో బౌండరీలు వేస్తున్నారు.