అందోల్, ఏప్రిల్ 4: మండుతున్న ఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో జనం ఎండల నుంచి కాస్త ఉపశమనం కోసం చల్లదనాన్ని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఇండ్లలో ఏసీ, కూలర్లు, ఫ్రిజ్, ఫ్యాన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారులు సమ్మర్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై రాయితీలు కల్పిస్తూ సేల్స్ పెంచుకుంటారు. నియోజకవర్గ కేంద్రమైన అందోల్-జోగిపేటతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోని గృహోపకరణాల దుకాణాలు సమ్మర్ సీజన్లో కొనుగోలుదారులతో కిక్కిరుస్తున్నాయి.
పెరిగిన ఎక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు..
ప్రస్తుతం ఏసీ, ఫ్రిజ్, కూలర్, ఫ్యాన్ల కొనుగోళ్లపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. దీంతో దుకాణదారులు వివిధ కంపెనీలకు చెందిన రకరకాల మోడల్స్ అమ్మకానికి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. వస్తువుల కొనుగోళ్లలో సైతం దుకాణాల యజమానులు డబ్బుల చెల్లింపుపై వెసులుబాటు కల్పిస్తుండడంతో ప్రజలకు కొంత డబ్బుల ఇబ్బంది తొలిగి, వ్యాపారులకు గిరాకీ పెరుగుతున్నది. ప్రస్తుతం పల్లెల్లో సైతం పట్టణాల మాదిరిగా భారీ దుకాణాలు వెలిశాయి. దూరప్రాంతాలకు వెళ్లి వస్తువులు కొనాలంటే సమయం వృథా, రవాణాచార్జీలు కూడా ఎక్కువ అవుతుంటాయని స్థానికంగానే అన్ని వస్తువులు సరసమైన ధరలకు లభిస్తుండడంతో ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వ్యాపారాలు బాగానే సాగుతూ మంచి లాభాలు సైతం వస్తున్నాయని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి
వస్తువుల కొనుగోళ్ల విషయంలో ప్రజలు కాస్తా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ధరలు తక్కువగా ఉన్నాయని నాణ్యత లేని వస్తువులను కొంటే ఇబ్బందులు రావొచ్చని చెబుతున్నారు. ధర కొంత ఎక్కువైన కంపెనీ వస్తువులు కొంటే బాగుంటాయని సూచిస్తున్నారు.