సిర్గాపూర్, ఏప్రిల్ 27 : ఎటు చూసినా గట్టురాళ్లు, ఎత్తు పల్లాల ప్రదేశం.. అన్నీ బీడు భూములే.. సాగు సాంద్రతకు పనికిరాని పడావు భూములే కనిపిస్తాయి. ఇలాంటి భూముల్లో రై తులు వానాకాలంలో (వర్షాధార) పంటలపై ఆధారపడి జీవిస్తున్నారు. పంటలు పండకపోవడంతో ఆదాయం లేకపోవడంతో ఇక్కడి రైతులు ఉపాధి కోసం వలస వెళ్లడం పరిపాటి. ఇది సిర్గాపూర్ మండలంలోని కిషన్‌నాయక్‌తండాలో రైతుల పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులను చైతన్యపరిచి భూములు సాగులోకి తెచ్చి, వారి ఆర్థికాదాయం మెరుగుపర్చేందుకు వాటర్ షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్టు (వాటర్ సంస్థ) ముందుకొచ్చింది. భూగర్భ జల వనరులు పెంపొందించడానికి, యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని మెట్టభూముల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
మట్టి, నీటి సంరక్షణకు చర్యలు
కిషన్‌నాయక్‌తండా శివారులో వాటర్సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ రవిప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి టెక్నికల్ సిబ్బందితో నీరు, మట్టి సంరక్షణకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సర్వే, ఇతర చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలంలో గట్టుప్రాంత భూ ముల్లో నీరు వృథా పోకుండా ఉండేందుకు గట్టు చుట్టూ కందకాల తవ్వకాల పనులు చేపట్టారు. గతేడాది ఇక్కడ చేపట్టిన నీరు, మట్టి సంరక్షణ పనులు సత్ఫలితాలిచ్చాయి. కందకాల్లో నీళ్లు నిల్వ ఉండడం, వరద నీరు భూమిలోకి ఇంకడంతో భూ గర్భ జలాలు వృద్ధి చెందాయి. ఇప్పటివరకు వెల్స్ ఫార్గో ట్రస్ట్ దాదాపు రూ. 18 లక్షలు వెచ్చించి 246 ఎకరాల్లో సహజ వనరుల నిర్వహణ, నిరంతర ప్రకృతి కందకం, ట్రెంచ్ కమ్ బండ్, నీటి సంగ్రహణ కందకాలు అభివృద్ధ్ది పనులు చేపట్టారు.
సుస్థ్థిర సాగుపై వాటర్ షెడ్ సంస్థ చేయూత
కిషన్నాయక్తండాలోని రైతులకు సుస్థిర వ్యవసాయంపై వాటర్ షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్టు అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతులను చైతన్యవంతులను చేసి, 15 నుంచి 20 మందిని గ్రూపుగా మార్చారు. వీరిని సుస్థి ర వ్యవసాయం చేయించారు. ఆర్థిక, సంక్షేమ ఫలాలను అందజేయడంలో వాటర్‌షెడ్ వసుంధర సేవక్ నాందేవ్ కృషి చేస్తున్నారు. తండాలో 4 గ్రూపులు కొనసాగుతున్నాయి. ఇటీవలే వీరికి బ్యాంకు ఖాతాలు తెరిచి, ఒక్కో బృందానికి రూ.6వేల నగదు డిపాజిట్ చేశారు. సుస్థిర సాగుకు విత్తనాలు అందించి, సేంద్రియ ఎరువులు తయారీకి అవసరమయ్యే వేస్ట్ డీకంపోజర్, అమృతపాణి, ఎల్లోస్టిక్స్, ఫరోమాన్ ట్రాప్స్, ట్రైకోడెర్మా పౌడర్, స్ప్రింక్లర్లు, పైపులు, పవర్ వీడర్స్ అందజేసింది. దీంతో గత వానకాలంలో రైతులు మంచి దిగుబడులు సాధించారు.
ఫామ్‌పాండ్‌లో నీళ్లు వచ్చినయి
మా చేనులో వాటర్ సంస్థ వాళ్లు ఫామ్ ఫాండ్ తవ్వించిన్రు. మంచిగ పనికొచ్చింది. ఫామ్ఫాండ్ వాన నీ టితో నిండినది. దీని వల్ల మా చేను లో జొన్న, ఉల్లిగడ్డ పంట మంచి ది గుబడి వచ్చింది. రైతులందరికీ మీ టింగ్ పెట్టి మంచి సలహాలు ఇస్తున్రు. వాటర్ సంస్థ చే సిన పనులతో మా భూమిలో పంటలు సాగవుతున్నది.
– సునీత, రైతు, కిషన్‌నాయక్ తండా
వాటర్‌షెడ్ కృషితో భూములు అభివృద్ధి
వాటర్‌షెడ్ సంస్థ ఆధ్వర్యంలో కిషన్‌నాయక్‌తండా శివారులో భూములు అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు 62 ఎకరాల్లో 40 మంది రైతుల భూముల్లో నీటి కందకాల తవ్వకం, 45 చోట్ల డగ్ ఔట్ పాండ్, ఫామ్‌పాండ్ తదితర పనులు చేశారు. 70 శాతం సబ్సిడీపై 27 మంది రైతులకు స్ప్రింక్లర్లు, కలుపు యంత్రాలు -8, నీటి డ్రమ్ములు-60 ఇచ్చారు. సుస్థిర సాగుపై వాటర్‌షెడ్ సంస్థ ప్రతిని ధులు మంచి సలహాలు ఇచ్చి, విత్తనాలు, ఎరువులు ఇస్తున్నారు.
– నాందేవ్, గ్రామ వసుంధర సేవక్, కిషన్‌నాయక్‌తండా