పటాన్చెరు, ఏప్రిల్ 4: అనేక రంగాల్లో అణుశక్తిని వినియోగిస్తున్నట్లు రేడియో కెమిస్ట్రీ-ఐసోటోప్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.కన్నన్ తెలిపారు. సోమవారం గీతం స్కూల్ ఆఫ్ సైన్సెస్‌లో ‘రేడియో కెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’ అనే అంశంపై నిర్వహించనున్న ఐదు రోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్, ఔషధాలు, ఆహారం, వ్యవసాయం, మురుగు, పరిశుభ్రత, స్టెరిలైజేషన్ వంటి రంగాల్లో రానున్న కాలంలో పరమాణువును (అణుశక్తిని) శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో ప్రస్తుతం 6,780 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో 22 అణు విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. మరో పది నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అదనంగా ప్రాథమిక, అనువర్తిత పరిశోధన, రేడియో ఐసోటోప్ ఉత్పత్తి, పదార్థాల పరీక్ష మొదలైన వాటికి ఉపయోగించే ట్రాంబే, కల్పక్కంలో పరిశోధనా రియాక్టర్లు ఉన్నాయన్నారు.
ఈ పరిశోధన, పవర్ రియాక్టర్ల నుంచి ఉత్పత్తి చేసిన రేడియో- ఐసోటోప్లు వైద్య ఉత్పత్తుల రేడియేషన్ స్టెరిలైజేషన్, ఉత్పత్తికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రేడియో ఫార్మాస్యూటికల్స్, న్యూక్లియర్ మెడిసిన్, క్యాన్సర్ చికిత్సల్లో కూడా వినియోగిస్తున్నామన్నారు. రేడియో-ఐసోటోప్లు వ్యవసాయంలో మెరుగైన రకాల విత్తనాల ఉత్పత్తికి, సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, మామిడి వంటి ఆహార పదార్థాల రేడియేషన్ ప్రాసెసింగ్‌కు ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ముంబయిలోని బాబా అణు పరిశోధనా సంస్థ (బార్క్) అభివృద్ధి చేసిన రేడియేషన్ టెక్నాలజీ రేడియోగ్రఫీ, గామా-రే డెన్సిటో మీటర్లు, రేడియోగ్రఫీ కెమెరాలు, ఫుడ్ రేడియేటర్లు వంటి అనేక పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ఏవీఆర్ రెడ్డి ‘రేడియో కార్యాచరణ, అణు క్షయం’ అనే అంశంపై విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. బార్క్ శాస్త్రవేత్త డాక్టర్ సిరాజ్ అహ్మద్ అన్సారీ వర్క్‌షాప్ గురించి వివరించారు. కార్యక్రమంలో గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీఈవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, డాక్టర్ నరేశ్‌కుమార్ కటారి పాల్గొన్నారు.