డయాగ్నోస్టిక్ సేవల కోసం కాంటినెంటల్ దవాఖానతో ఒప్పందం
ఐఐటీ హైదరాబాద్‌లో ముగిసిన ఎలాన్ వేడుకలు
సంగారెడ్డి, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమరీ హెల్త్‌కేర్ సెంటర్‌ను కాంటినెంటల్ దవాఖాన చైర్మన్ గురునాథ్‌రెడ్డి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్‌మూర్తి, ఐఐటీ హైదరాబాద్ పాలకమండలి చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌తో సంయుక్తంగా వైద్య, డయాగ్నోస్టిక్ సేవలు అందించేందుకు కాంటినెంటల్ దవాఖానతో ఒప్పందం కుదుర్చుకున్నది. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్‌లోని విద్యార్థులు, బోధనా సిబ్బందికి 24 గంటల వైద్యసేవలు అందించేందుకు హెల్త్ సెంటర్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. భవిష్యత్‌లో కాంటినెంటల్ దవాఖాన వైద్య నిపుణులతో టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఐఐటీ పాలకమండలి చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్‌లో హెల్త్‌కేర్ సెంటర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కాంటినెంటల్ దవాఖాన చైర్మన్ గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి సంయుక్తంగా పనిచేయటం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు, బోధనా సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో హెల్త్‌సెంటర్ ఇన్చార్జి డా.ఆరవింద్‌కుమార్, ప్లానింగ్ విభాగం డీన్ ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ముగిసిన ఎలాన్ వేడుకలు
ఐఐటీ హైదరాబాద్‌లో ఎలాన్ ఎన్విజన్ వేడుకలు ముగిశాయి. చివరిరోజు విద్యార్థులకు కోడింగ్, సర్క్యూట్ బిల్డింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కోడింగ్ పోటీల్లో ఐఐటీ పాట్నా, ఐఐటీ మద్రాస్‌తోపాటు దేశంలోని వేర్వేరు ఎన్ఐటీల నుంచి వచ్చిన 300మంది విద్యార్థులు పాల్గొన్నారు. సర్క్యూట్ బిల్డింగ్ పోటీల్లో 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎలాన్లో భాగంగా విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించారు. రాక్ బ్యాండ్ సింగర్ ఆహుజా సింగల్ బృందం పాటలు పాడి విద్యార్థులను అలరించారు. జైపూర్‌కు చెందిన లాస్టు స్టోరీస్ బ్యాండ్ బృందం సభ్యులు పాటలు పాడారు.