గుమ్మడిదల, మార్చి27: జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం వీరభద్రస్వామి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మండలంలోని బొంతపల్లి వీరన్నగూడెంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయంలో చైర్మన్ గటాటి భద్రప్ప, ఈవో శశిధర్‌గుప్తా, ధర్మకర్తల ఆధ్వర్యంలో ఈ కల్యాణాన్ని జరిపించారు. వీరభద్రస్వామిని ఎదుర్కోలు, రంగులు చల్లుకుని అయ్యవారిని కల్యాణ వేదిక వద్దకు మంగళవాయిద్యాలతో తీసుకొచ్చారు. భక్తులు, ధర్మకర్తలు స్వామి వారికి స్వాగతం పలికారు. వీరభద్రస్వామిని, భద్రకాళీ అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కల్యాణం జరిపించారు. అర్చకులు, పురోహితులు వేదమంత్రోచ్ఛరణలతో కల్యాణ మంత్రాలు పఠించగా స్వామి వారు అమ్మవారికి మంగళ సూత్రధారణ చేశారు. వర్తక సంఘం అధ్యక్షుడు వీ.బాలరాజు భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కల్యాణానికి ఎమ్మెల్యే దంపతులు గూడెం మహిపాల్‌రెడ్డి, యాదమ్మ, సంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణా విజయభాస్కర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ మంజులా వెంకటేశ్‌గౌడ్, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు హాజరయ్యారు.
అగ్నిగుండాల్లో నడిచిన భక్తులు
శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు అగ్నిగుండాలకు వేద పండితులు పూజలు చేశారు. వీరభద్రస్వామి భద్రకాళీ సమేతుడై పొన్న వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఎస్సై విజయకృష్ణ, పోలీసు సిబ్బంది బందోబస్తులో భక్తులు అగ్నిగుండాల్లో నడిచి మొక్కులు సమర్పించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.
రూ.20లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే
వీరభద్రస్వామి దేవాలయానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి రూ.20 లక్షలు విరాళంగా అందజేశారు. బొంతపల్లి-వీరన్నగూడెంలోని వీరభద్రస్వామి ఆలయంలో నిర్మించిన రాజగోపురాలకు ఎమ్మెల్యే దంపతులు తనవంతుగా సాయం చేశారు. రూ.20లక్షల నగదును విరాళంగా చైర్మన్ గటాటి భద్రప్పకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, మమతావేణు, నర్సింహరెడ్డి, ధర్మకర్తలు లక్ష్మీనారాయణ, మాడపు వీరమల్లేశ్, గోపిగౌడ్, చెక్క కృష్ణాగౌడ్, జహంగీర్‌రెడ్డి, ఈవో శశిధర్‌గుప్తా, ఆలయ వతనుధారులు ఆలేటి జగన్మోహన్రెడ్డి, నర్సింహారావు పంతులు, వెంకట్‌రెడ్డి, నాయకులు నాగేందర్‌గౌడ్, గౌరీశంకర్‌గౌడ్, దేవేందర్‌రెడ్డి, గిద్దెరాజు, మడపతి గణేశ్, ఆలేటి వెంకట్‌రెడ్డి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు రవీంద్రమూర్తి, సోమయ్య పాల్గొన్నారు.