మెదక్ జిల్లాకు చేరిన గోదావరి జలాలు
తూప్రాన్ మండలం కిష్టాపూర్ చెక్‌డ్యాం వద్ద రైతుల ఆనందోత్సాహాలు
యాసంగికి తీరనున్న నీటి కొరత, పెరగనున్న భూగర్భజలాలు
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
తూప్రాన్, మార్చి 25: మండలంలోని కిష్టాపూర్‌కు గోదావరి జలాలు శుక్రవారం ఉదయం చేరుకున్నాయి. మధ్యాహ్నంలోగా చెక్‌డ్యాం నిండి పొంగిపొర్లుతున్నది. కొండపోచమ్మ సాగర్ నుంచి వర్గల్ నవోదయ విద్యాలయం వద్ద హల్దీ వాగులోకి ఈనెల 18న మంత్రి హరీశ్‌రావు గోదావరి జలాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. మండుటెండల్లో నీళ్లు రావడంతో పరిసర ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తూప్రాన్, పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ అద్భుత దృశ్యాలను వీక్షిస్తూ, సెల్ఫీలు దిగుతూ ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో తూప్రాన్ మండలంలోని హల్దీవాగు పరిసర ప్రాంతాల రైతులకు యాసంగి పంటకు నీటి కొరత తీరనున్నది. ఈ సందర్భంగా హల్దీవాగు పరిసర ప్రాంతాల రైతులను పలుకరించగా వాగుకు దగ్గరగా ఉన్నవారు మోటర్లు బిగించుకుని నీటిని వాడుకుంటామని తెలుపారు. హల్దీవాగుకు దూరంగా పొలాలున్న రైతులు భూగర్భజల మట్టం పెరుగుతుందని, తద్వారా తమ బోర్లు వేసవిలో ఆపకుండా పోస్తాయని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
ఎక్కడో ఉన్న గోదావరి నీళ్లు మా పొలాల దగ్గరికి తేవడమంటే మామూలు మాట కాదు. ఇది ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం. మా పొలం వాగుకు కొంచెం దూరంలో ఉన్నా భూగర్భజలాలు పెరగడానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి. బోర్లు ఆపకుండా పోస్తాయి. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – మోర బాలయ్య, రైతు, కిష్టాపూర్