సిద్దిపేట అర్బన్, జూలై 20 : బ్యాంకుల్లో ఏదైనా సంఘటన జరిగితే కేసుల పరిశోధనలో అధికారులు సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత బ్యాంకు అధికారులకు సూచించారు. బుధవారం జిల్లాలో ఉన్న బ్యాంక్ మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్‌తో బ్యాంకుల అంతర్గత భద్రత, ఏటీఎంలో భద్రత, సీసీ కెమెరాల పనితీరు గురించి కమిషనరేట్ కార్యాలయంలో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని రోజూ మానిటరింగ్ చేయాలని సూచించారు. బ్యాంకులో ఏదైనా సంఘటన జరిగితే అల్లారం పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంకులో తప్పకుండా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బ్యాంకులో ఉన్న కిటికీలు, డోర్స్, స్ట్రాంగ్ రూమ్ 15 రోజులకు ఒకసారి వాటి పనితీరు గురించి తనిఖీ చేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న 125 బ్యాంకుల్లో పాయింట్స్ బుక్స్ ఏర్పాటు చేస్తామని, రాత్రి, పగలు పోలీస్ అధికారులు రోజుకు రెండుసార్లు బ్యాంకులను తనిఖీలు చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. బ్యాంకు మేనేజర్లు సంబంధిత ఎస్సైల సెల్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఏదైనా ఘటన జరిగితే త్వరగా సమాచారం ఇచ్చే విధంగా విధులు నిర్వహించాలన్నారు. మెయిన్ బ్రాంచ్ నుంచి ఇతర బ్రాంచ్‌లకు డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు అన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలని సూచించారు.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరాలపై బ్యాంక్ అధికారులకు సీపీ శ్వేత అవగాహన కల్పించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా బ్యాంకు, పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కొంత మంది సైబర్ నేరస్తులు తెలుగువారిని నియమించుకుని నేరాలు చేయిస్తున్నారని, వారిపై బ్యాంక్ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. బ్యాంకు, పోలీస్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి సైబర్ నేరాలు జరిగిన బాధితులకు డబ్బులు తిరిగి వచ్చే విధంగా చూడాలన్నారు. సైబర్ సెక్యూరిటీ, కోఆర్డినేషన్ గురించి దుబ్బాక సీఐ కృష్ణ, ఐటీ సెల్ ఎస్సై శ్రీకాంత్ బ్యాంకు అధికారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ డి.సత్యజిత్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, గజ్వేల్ ఏసీపీ రమేశ్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.
మెరుగైన సేవలందించాలి
సిద్దిపేట అర్బన్, జూలై 20 : కమిషనరేట్ కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించి ప్రజల మెప్పు పొందాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి 5ఎస్ ఇంప్లిమెంటేషన్, ఈఆఫీస్ మెయింటెనెన్స్, క్లీన్ అండ్ గ్రీన్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్ పనితీరును చూసి మిగతా జిల్లాల వారు అమలు పర్చుకునే విధంగా మన పని తీరు ఉండాలన్నారు. టెక్నాలజీతో ముందుకు వెళ్లాలని సూచించారు. 5ఎస్ ఇంప్లిమెంటేషన్ 10 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. కార్యాలయాన్ని సొంత ఇంటిలా శుభ్రంగా ఉండేటట్లు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, కమ్యూనికేషన్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై సంపత్ పాల్గొన్నారు.