సిద్దిపేట అర్బన్, జూలై 14 : జిల్లాలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల బృందానికి సూచించారు. ఐదు రోజుల పాటు పర్యటించి జిల్లాలో జరుగుతున్న ఉపాధిహామీ పథకం పనులను పరిశీలించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల బృందం గురువారం కలెక్టరేట్లో డీఆర్డీవో గోపాల్‌రావుతో కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పనుల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనం, మరింత మందికి ఉపాధి కల్పించేందుకు గల అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ వారికి సూచించారు. జిల్లా ప్రజలకు గరిష్ట స్థాయిలో ప్రయోజనం కలిగేలా నివేదికలను సిద్ధం చేసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాలని కేంద్ర బృందం సభ్యులను కోరారు. జిల్లాలోని గ్రామాలు, పని ప్రదేశాలు, చేపట్టిన పనులు, వాటి ప్రయోజనాలను అధికారుల బృందానికి వివరించాలని డీఆర్డీవో గోపాల్‌రావును ఆదేశించారు. కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ, బృందం లీడర్ నివేదిత ప్రసాద్, ప్రాజెక్టు ఆఫీసర్ రంజిత్ తులసి పుర్టీ, ఇంజినీర్ ఫర్హాన్ ఏ ఖురేషి, డీఆర్డీవో ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.