మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 18: భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. క్రిస్మస్ ముందు వచ్చిన ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గొని ఏసయ్యకు మొక్కులు సమర్పించుకున్నారు. చర్చి ప్రాంగణంలోని స్థానిక సండే స్కూల్ విద్యార్థులు యేసు ప్రభువు చరిత్రను ప్రదర్శించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి జార్జి ఎబినేజర్ రాజు భక్తులనుద్దేశించి దైవ సందేశం వినిపించారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకున్న అనంతరం చర్చి మైదానంలోని చెట్లకింద వంటావార్పు చేసుకున్నారు. పాస్టర్లు శ్రీనివాస్, డేవిడ్, జైపాల్, సువర్ణ, భక్తులను ఆశీర్వదించారు. ప్రార్థనల్లో చర్చి కమిటి సభ్యులు రోలండ్పాల్, సాంశన్ సందీప్, వికాస్, సునీల్, జయరాజ్, అనూఫ్, సునీల్, జాయ్ముర్రే, సువన్డగ్లస్, సులక్షణ తదితరులు పాల్గొన్నారు.