పాపన్నపేట, మార్చి 2 : ఏడుపాయల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ. వంద కోట్లు కేటాయించారని ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి అన్నారు. ఏడుపాయల వనదుర్గామాతను బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో సార శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్సీకి ఘన స్వాగ తం పలికారు. ఈవో శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏడుపాయల క్షేత్రంలో జరిగే జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ ఏటా కోటి రూపాయలు నిధులు కేటాయించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి ఉత్సవాలు వైభవంగా జరిగేలా చూస్తున్నారన్నారు. ఏడుపాయలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు రూ. వంద కోట్లు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్సీ గుర్తు చేశారు. దీంతో, ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడంతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు అందుతాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో సాగునీటికి డోకా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి అన్ని జిల్లాల రైతులకు సాగునీటిని అందిస్తున్నట్లు వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలో పూర్తి చేయించి సింగూరు ప్రాజెక్టుకు గోదావరి నీళ్లు వచ్చేలా చేసి సాగు, తాగు నీటిని అందించారన్నారు. ఏడుపాయల ఆలయంలో వచ్చే ఏడాది ఉత్సవాలకు శాశ్వత పనులు చేపట్టే విధంగా సీఎం కేసీఆర్ కృషితో మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిల సహకారంతో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి వెల్లడించారు. ఆయన వెంట పుల్లన్నగారి ప్రశాంత్‌రెడ్డి, కొత్తపల్లి సహకార సంఘం చైర్మన్ రమేశ్‌గుప్తా, నాయకులు బాలాగౌడ్, సత్యనారాయణ, నర్సింహాచారి, కిష్టయ్య, సాయిరెడ్డి, జగన్ ఉన్నారు.