మెదక్ అర్బన్, నవంబర్17: ఆర్థిక ఇబ్బందులతో తన ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషమిచ్చి హత్యచేసి, తన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేంపించిన నాగిరెడ్డిగారి శ్యామలకు జీవిత ఖైదుతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద గురువారం తీర్పు వెలువరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపిన వివరాల ప్రకారం.. అల్మాయిపేట గ్రామం అందోల్ మండలానికి చెందిన ప్రభాకర్‌రెడ్డికి, మెదక్ నివాసి రెడ్డిపల్లి శ్యామలతో 9 ఏండ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూతురు (7), కుమారుడు (4) కొన్నేండ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నందున వేర్వేరుగా ఉంటున్నారు.
రెడ్డిపల్లి శ్యామల మెదక్ మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తూ పిల్లలతో పట్టణంలోని నవాబ్‌పేట్‌లో నివాసం ఉంటున్నది. శ్యామలకు కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున అవి భరించలేక కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించింది. దీంతో 2014లో తన ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషం ఇచ్చింది. తామిద్దరం కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందామని తన తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించింది. దీంతో తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నది.
రెడ్డిపల్లి శ్యామలను అక్కడ ఉన్నవారు గమనించి కాపాడారు. వీరి బలవన్మరణాలకు కారణమైన శ్యామలపై నేరస్తురాలి భర్త ఫిర్యాదు మేరకు అప్పటి మెదక్ పట్టణ సీఐ కేఎల్ విజయ్‌కుమార్ అండర్ సెక్షన్ 302, 306, 309లో కేసు నమెదు చేశారు. అనంతరం దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి నేరస్తురాలికి శిక్ష విధించింది. నేరస్తురాలకి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ తరఫున వాదన వినిపించిన ఫజల్ ఆహ్మద్, కేసు విచారణ చేసి చార్జిషీట్ దాఖ లు చేసిన అప్పటి సీఐ, మెదక్ కోర్టు లైజనింగ్ అధికారి విఠల్, కోర్టు పీసీ రవీందర్‌గౌడ్, మెదక్ టౌన్ కోర్టు పీసీ హనుమంతును ఎస్పీ అభినందించారు.