సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 17: జిల్లాలో పోడు భూముల అర్హుల జాబితాను సిఫారసు చేయడానికి ఆయా స్థాయి కమిటీలు చేపట్టాల్సిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్స్, పంచాయతీ శాఖ డీఎల్పీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల వారీగా సంబంధిత పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో, అటవీ శాఖ అధికారులతో వచ్చిన క్లెయిమ్స్ ఏవిధంగా పరిశీలిస్తున్నారు, నిర్వహిస్తున్న రికార్డులు, సేకరించిన రుజువులు, ఎఫ్ఆర్సీ, గ్రామ సభల తీర్మానాలు, దరఖాస్తుదారుకు సంబంధించిన ఆధారాలు, తదితరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
వివరాలన్ని ప్రాపర్‌గా ఉండాలన్నా రు. ప్రతి క్లెయిమ్‌కు సంబంధించి ఆమోదాలు, తిరస్కరణకు పూర్తి సాక్ష్యాధార నివేదికలు ఉండాలని స్పష్టంచేశారు. అర్హులకు న్యాయం జరిగేలా కృషి చేయాలన్నా రు. దరఖాస్తు వారీగా పరిశీలించి స్క్రూటినీ చేసి, ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎంపీవో, డివిజనల్ పంచాయతీ అధికారి ద్వారా సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపాలని సూచించారు. ప్రతి దరఖాస్తునకు అటవీ హక్కుల కమిటీ, గ్రామ సభ తీర్మానాలు ఉండాలన్నారు. తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించి కారణాలు స్పష్టంగా ఉండాలన్నారు. అన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడే సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి ఇవ్వాలన్నారు. అర్హుల జాబితాను సబ్ డివిజన్ స్థాయి కమిటీకి త్వరగా పంపాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్‌రావు, జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి ఫిరంగి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, డీఎల్పీవోలు, అటవీ రేంజ్ అధికారులు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గణన సమాచారం సమర్పించాలి
సమగ్ర చర్చ అనంతరం జిల్లా స్థాయిలో పూర్తి గణన సమాచారం వర్గాల వారీగా సమర్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏడో ఆర్థిక గణనకు సంబంధించిన జిల్లా స్థాయీ సమన్వయ సంఘ సమావేశాన్ని నిర్వహించారు. గణన నిర్వహించిన సీఎస్సీ ప్రతినిధులు గణన సంబంధించిన వివరాలు, సేకరించిన సమాచారాన్ని కమిటీకి నివేదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కార్యకలాపాల వారీగా ఉద్యోగిత పంపిణీ, పంచాయతీ, గ్రామ స్థాయి ఆర్థిక వ్యవస్థ విశ్లేషణ, ఆర్థిక పరమైన సంస్థ సమగ్ర సమాచార సేకరణ కోసం నిర్దేశించిన 7వ ఆర్థిక గణనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ గణన 2020 మార్చిలో ప్రారంభమై 2021 మార్చిలో ముగిసిందాని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ప్రశాంత్ కుమార్, ఎన్ఎస్వో అధికారి, డీఐవో, ముఖ్య ప్రణాళిక అధికారి పాల్గొన్నారు.