సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి, నవంబర్ 15 : ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సంగారెడ్డి వైద్య కళాశాల ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మంగళవారం సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో కాలేజీ మొదటి బ్యాచ్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పేదలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాలేజీ త్వరగా పూర్తయ్యేలా కృషి చేసిన మంత్రి హరీశ్‌రావును ముఖ్యమంత్రి అభినందించారు. వైద్యాధికారులతో పాటు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వేడుకకు హాజరయ్యారు. టీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని పోతిరెడ్డిపల్లి పీఎస్ఆర్ గార్డెన్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల రాక అంతటా సందడి వాతావరణం నెలకొన్నది. జిల్లావాసుల చిరకాల వాంఛ నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలోని పేదలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందే లా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం ఆన్లైన్ (వర్చువల్) ద్వారా సీఎం కేసీఆర్ సంగారెడ్డి మెడికల్ కాలేజీ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సంగారెడ్డి మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న సంకల్పంతో వైద్యవిద్యను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాల్లో 12 వైద్య కళాశాలలు ప్రారంభించుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ వైద్య విద్య చరిత్రలో ఒకేరోజు ఎనిమిది వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభించడం సువర్ణ అధ్యాయంగా పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కావటం, ఉద్యమకారులు పాలకుల కావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఉద్యమకారుడైన హరీశ్‌రావు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా మెడికల్ కాలేజీలు త్వరగా ప్రారంభమయ్యేలా కృషి చేశారని, ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్ రాజర్షిషా, దవాఖాన సూపరింటెండెంట్ డా.అనిల్, ఆర్‌ఆండ్‌బీ ఎస్ఈ వసంత్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ మాణిక్యం, మున్సిపల్‌చైర్‌పర్సన్ విజయలక్ష్మి, వైస్‌చైర్మన్ లతా విజయేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు విజయేందర్‌రెడ్డి, ఆర్.వెంకటేశ్వర్లు, మందుల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడారు.
జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకేరోజు సంగారెడ్డి జిల్లాతో కలిపి ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు విద్యార్థులు ఉత్తమ వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ సంగారెడ్డి మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించిన సీఎం కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ వల్లే సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటైందని, విద్యార్థుకు మెడికల్ సీట్లు లభిస్తున్నట్లు చెప్పారు. తన ఇద్దరు మిత్రుల బిడ్డలకు సంగారెడ్డి మెడికల్ కాలేజీలో సీట్లు రావడం ఎంతో సంతోషం కలిగిచిందన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ విద్యార్థులను ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్దాలని ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లను కోరారు.
హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ కాలేజీ తరగతులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజలతోపాటు పొరుగు జిల్లా వారికి మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉత్తమ వైద్యులుగా ఎదిగి పేదలకు సేవలందించాలని కోరారు.
సంగారెడ్డి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేరోజు ఎనిమిది మెడికల్ కాలేజీ తరగతులు సీఎం కేసీఆర్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థులకు బంగారు బాటలు వేశారన్నారు. వైద్య కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయని, విద్యార్థులు బాగా చదువుకుని మంచి వైద్యులుగా ఎదగాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి జిల్లా యంత్రాంగం తరఫున సహకరిస్తామన్నారు.
సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని తమ తల్లిదండ్రులు, కళాశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.వాణి మాట్లాడుతూ సంగారెడ్డి మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 100 మంది విద్యార్థులు చేరారని త్వరలోని మిగతా విద్యార్థులు చేరతారని చెప్పారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ తరగుతులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
స్థానికంగా వైద్య సేవలు అందిస్తా…
కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో సీటు రావడం సంతోషంగా ఉన్నది. ఎంబీబీఎస్ 5 సంవత్సరాల కోర్సు పూర్తి చేసి స్థానిక పేదలకు వైద్య సేవలు అందిస్తా. తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో వైద్య విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఎంతో లాభం కలుగుతుంది. నేను కన్న కలలను నిజం చేసే అవకాశం కల్పించిన తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటాం.
– శ్రీజ, ఎంబీబీఎస్ విద్యార్థిని, నిజామాబాద్
రోగులకు సేవలందిస్తా…
సమాజంలో మానసిక ఒత్తిడికి గురై దీర్ఘాకాలిక వ్యాధిగ్రస్తులుగా మారుతున్న మానసిక రోగులకు వైద్య సేవలు చేస్తా. బాధితులకు ఎవరు లేకపోతే ఉచిత సేవలు చేస్తు ధైర్యం కల్పిస్తా. మాలాంటి పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకోవాలని ఆసక్తి ఉన్నా అధిక ఫీజుల కారణంగా అది సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు ప్రభుత్వమే వైద్య కళాశాల ఏర్పాటు చేసి వైద్య విద్య అందించడం సంతోషంగా ఉన్నది.
– ప్రణతి, వైద్య విద్యార్థిని, సంగారెడ్డి
సేవ చేసే అవకాశం వచ్చింది..
నేను జహీరాబాద్ నివాసిని. మా తల్లిదండ్రులది సామాన్య కుటుంబం. వైద్య విద్య చదువుకొని ప్రజలకు సేవ చేయాలనే పట్టుదలతో సీటు సాధించా. వైద్యకోర్సులను పూర్తిచేసి జహీరాబాద్ సమీప ప్రాంతాల పేదలకు వైద్య సేవలందిస్తా. మా ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో చదువులేని ప్రజలు ఉంటారు. అలాంటి వారికి వైద్యంపై అవగాహన కల్పించి సేవలు చేస్తా.
– మహ్మద్ షరీఫ్, జహీరాబాద్