పేదరికం.. పైగా తల్లిదండ్రులు నిత్యం కష్టపడితే తప్ప కుటుంబం ముందుకు సాగలేని పరిస్థితులను అర్థం చేసుకుని తాను సైతం సంపాదించి తల్లిదండ్రులకు తోడుగా నిలవాలనే ఆలోచనలు చేస్తున్న క్రమంలో పందిపెల్లి శిరీష జనవికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు, జ్యూట్ బ్యాగుల శిక్షణ ఆమెకు తోడుగా నిలిచింది. రెండు నెలల్లో శిక్షణ పూర్తి చేసుకొని, నెలనెలా ఉపాధి పొందుతోంది. ఇలా శిరీషతో పాటు అనే మంది మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ఉపాధి మార్గాలు అయ్యాయి.
హుస్నాబాద్ టౌన్, నవంబర్ 14: మారుతున్న సమాజంలో పెరిగిపోతున్న ఖర్చులు.. కుటుంబాలకు మోయలేని భారంగా మారుతున్న తరుణంలో.. స్వయం ఉపాధికోసం ఇచ్చే శిక్షణలు వారికి తోడుగా.. అండగా నిలుస్తున్నాయి. తమకాళ్లపై తాము నిలబడే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నాయి. ఇలా ఒకరిద్దరు కాదు వందలాది మంది మహిళలు ఆయా రంగాల్లో శిక్షణ పొందుతూ స్వయం ఉపాధిని పొందుతున్నారు.
ఆయా రంగాల్లో శిక్షణలు..
భర్త సంపాదనకు తోడుగా.. తల్లిదండ్రులకు అండగా నిలవాలనే మహిళలకు పలు సంస్థలు అందిస్తున్న స్వయం ఉపాధి శిక్షణలు తోడుగా.. అండగా నిలుస్తున్నాయి. ఇంటిల్లిపాది ఏదో ఒక పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లోనుంచి బయటపడుతున్నారు. వీరికి స్వయం ఉపాధి పొందేలా పలు సంస్థలు శిక్షణలు, సహకారం అందిస్తున్నాయి. ముఖ్యంగా కుట్టుశిక్షణ, జ్యూట్‌బ్యాగుల తయారీ, మగ్గం, బ్యూటీషియన్ తదితర రంగాల్లో ఆయా సంస్థలు మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. రెండు మాసాలనుంచి నాలుగు నెలల పాటు వివిధ రకాల శిక్షణలు అందిస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో మహిళలు శిక్షణవైపు మొగ్గుచూపుతున్నారు. జనవికాస గ్రామీణ అభివృద్ధి సంస్థలాంటివి ఉచితంగానే శిక్షణలు అందిస్తున్నప్పటికీ మరికొన్నిసంస్థలు కొంత నగదును తీసుకుని శిక్షణ ఇస్తున్నాయి.
నెలకు 300మందికి పైగా శిక్షణ
హుస్నాబాద్ పట్టణంలోని పదివరకు స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలు మహిళలకు పలు రంగాల్లో శిక్షణనిస్తున్నాయి. ఆయా సంస్థల్లో నెలకు 300మందికి పైగా మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఎక్కువ మంది కుట్టు శిక్షణకు ఆసక్తి చూపుతున్నారు. మరికొంత మందిమహిళలు మగ్గం, బ్యూటీషియన్ రంగంవైపు వెళ్లేందుకు శిక్షణ తీసుకుంటుండగా, ప్లాస్టిక్ నివారణలో తాము సైతం భాగస్వామ్యులు కావడానికి జ్యూట్‌బ్యాగుల తయారీని నేర్చుకుంటున్నారు. వీరు త్వరితగతిన
మెళకువలు నేర్చుకునేలా ఆయా సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి.
స్వయం ఉపాధి వైపు అడుగులు..
ఒకప్పుడు ఏడాదికి రూ.3వేల వరకు తమ బ్లౌజ్‌లు కుట్టించేందుకు వెచ్చించిన మహిళలు, నేడు శిక్షణ పొంది సొంతంగా ఇంటివద్దనే టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్, జూట్ బ్యాగుల తయారీతోపాటు పలు రంగాలకు చెందిన పనులను సొంతంగా చేసుకుంటున్నారు. ఇంటివద్దనే తమ వస్ర్తాలను తయారు చేసుకుంటూ డబ్బును ఆదా చేయడమే కాకుండా నెలకు కొంత మొత్తాన్ని సంపాదిస్తున్నారు. ఇలా అనేకమంది మహిళలు తాము నేర్చుకున్న పలు రకాల శిక్షణతో ఇంటివద్దనే ఆర్థికంగా సంపాదిస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
మహిళలు సొంత కాళ్లమీద నిలబడేందుకు..
ఒకరిపై ఆధారపడకుండా మహిళలు సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు శిక్షణలు అవసరం. నేర్చుకున్న శిక్షణతో సంపాదించి కుటుంబాలను పోషించుకోవచ్చు. మారుతున్న కాలాన్ని బట్టి మహిళలు సైతం అన్నింటా శిక్షణ తీసుకోవాలి. బ్యూటీషియన్ ఇప్పుడు అందరికి తప్పనిసరిగా అయింది. ఇది నేర్చుకుని ఎక్కువగా సంపాదించుకోవచ్చు. ఎంతోమంది మహిళలు నా వద్ద నేర్చుకుని సొంతంగా దుకాణాలు పెట్టుకుని సంతోషంగా జీవిస్తున్నారు.
– బోనగిరి రజిత టైలరింగ్, బ్యూటీషియన్, శ్రీకరం ఫౌండేషన్ నిర్వాహకురాలు, హుస్నాబాద్
శిక్షణ నేర్చుకుని ట్రైనరయ్యాను..
నేను ఇక్కడే జూట్ బ్యాగుల తయారీ శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు ఇదే సంస్థలో ట్రైనర్‌గా చేస్తున్న. రోజుకు 30మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నా. ఒకప్పుడు గృహిణిగా ఉన్న నాకు ఈ శిక్షణతోని సంపాదించే స్థాయికి ఎదిగా. ఇప్పుడు నెలకు రూ.10వేల వరకు సంపాదిస్తున్నా. ఈ సంపాదన నాకుటుంబానికి ఎంతో అండగా ఉంటున్నది.
– ఉమారాణి, ట్రైనర్, జనవికాసగ్రామీణ అభివృద్ధి సంస్థ, హుస్నాబాద్
కుటుంబానికి తోడుగా ఉంటుందని..
ఇంట్లో ఒకరు పని చేస్తే కుటుంబం మొత్తానికి సరిపోయేది. ఇప్పుడు ఇంట్లో ఎందరు ఉన్నా అందరు పనిచేస్తేనే నడుస్తుంది. అందుకోసమే నేను కుట్టుశిక్షణను నేర్చుకున్న. కొద్దిరోజుల్లోనే కుట్టు, కటింగ్ వచ్చింది. ఇంటికాడ కుట్టుకుంటున్న. చిల్లర ఖర్చులకు సైతం ఉపయోగపడుతున్నది.
– ఇటికాల మానస, మీర్జాపూర్
శిక్షణ మాలాంటి మహిళలకు మేలు చేస్తున్నది..
ఉచిత శిక్షణ మాలాంటి మహిళలకు ఎంతో మేలు చేస్తున్నది. నేను శిక్షణ పొంది కొత్త కుట్టుమిషన్ కొన్నా. గతంలో బయట కుట్టుకు ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఇంట్లోనే కుట్టుకుంటున్న. డబ్బులు కూడా ఆదా అవుతున్నవి. జ్యూట్‌బ్యాగులు కుట్టడం నేర్చుకున్న. ఇట్ల శిక్షణ ఇవ్వడం మహిళలు సంపాదించేందుకు ఉపయోగపడుతున్నది.
– జోత్స్య, హుస్నాబాద్
మనకాళ్లపై మనం నిలబడేందుకు..
మన కాళ్లపై మనం నిలబడేందుకు శిక్షణ అవసరం. ఎవరిపై ఆధారపడకుండా మన సంపాదన మనం సంపాదించుకునేందుకు కుట్టుశిక్షణ నేర్చుకుని ఇంట్లో కొత్తమిషన్ కూడా కొన్న. ఒకప్పుడు ఐదారువేల రూపాయలు బట్టలు కుట్టేందుకు అయ్యేవి. ఇప్పుడు నాతోపాటు మా ఇంట్లోవారివి సైతం నేనే కుట్టుకుని సంపాదించుకునే వ్యక్తిగా ఎదిగా.
– కత్తెర రాశి, హుస్నాబాద్