సంగారెడ్డి, నవంబర్ 14: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా ఛేదించి కోర్టులో హాజరుపర్చాలని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం పోలీస్ జిల్లా కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలను నియంత్రించడానికి పోలీసు అధికారులు సీసీ కెమెరాలను ఉపయోగించాలని సూచించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులను 60 రోజుల్లో కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
అన్నిరకాల కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సంబంధిత దోషులను కోర్టులో హాజరుపరిచి నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విషయాన్ని పరిశోధన చేసి తుది రిపోర్టు నివేదిక అందించాలన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ల అమలులో సహకరించని వ్యక్తులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులో జాప్యం చేయకుండా వెంటనే స్పందించి సంబంధిత నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, జహీరాబాద్, నారాయణఖేడ్ డీఎస్పీలు రఘు, బాలాజీ, ఎస్బీ ఇన్స్పెక్టర్ మహేశ్‌గౌడ్, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
సదాశివపేట, నవంబర్ 14 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, కామర్స్ విభాగంలో అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పతంజలి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పీజీ సబ్జెక్టులో 50శాతం మార్కు లు ఉండాలని, పీహెచ్డీ, నెట్, సెట్ చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ లోగా అర్హత ధ్రువపత్రాలు రెండు జిరాక్స్ సెట్లు అందజేయాలన్నారు. 16న అభ్యర్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.